Wednesday, January 22, 2025

మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన

- Advertisement -
- Advertisement -

సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో వారు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆశయంతో ఉన్నవారికి అధికారం అప్పజెప్పితే అభివృద్ధి చేసి చూపెడతారని నమ్మిన తెలంగాణ ప్రజలు మార్పు కోసం చేయి చేయి కలిపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ సెంటిమెంటుతో పాలకులు సాగించిన విధ్వంసాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ వందరోజుల ప్రజా పాలనను పూర్తి చేసుకోన్నారు. గతంలో కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే సంభాషించుకునే భిన్నవర్గాల ప్రజలు నేడు తమ భావాలను, హక్కులను, నిరసనలను స్వేచ్ఛగా ఏ వేదిక ద్వారా అయినా పంచుకుంటున్నారు.

కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి నేరుగా సచివాలయంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు నేరుగా వెళ్లి తమ గోడును చెప్పుకునే స్వేచ్ఛను కల్పించింది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళ, శుక్రవారం రోజుల్లో మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో విజ్ఞప్తులను తీసుకొని వాటిని పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు అనే భావనను మర్చిపోయిన ఉద్యోగస్థులు ఇప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వస్తుండడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఆత్మగౌరవమే ఆలంబనగా బతికే తెలంగాణ సమాజానికి రాచరిక ఆనవాళ్లు చెరిపివేత మానసిక సంతోషాన్ని కలిగించింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు సమాన స్థాయిలో అందాలన్నదే ఈ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారెంటీలను పూర్తి చేసుకొని మిగతా వాటిని కూడా సాధ్యమైనంత తొందరలో అందించాలని కృత నిశ్చయంతో ఉన్నది. టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసి అసంపూర్తిగా మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ కు సిద్ధమవుతున్నది.

రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి సారథ్యంలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వైబ్రేంట్ తెలంగాణ – 2050 నినాదంతో హైదరాబాద్ నగర అభివృద్ధి, విస్తరణకు మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు లండన్‌లోని థేమ్స్ నది, సబర్మతి రివర్ ఫ్రంట్ మాదిరిగా మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ నది పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ఖ్యాతి గాంచిన కాస్మోటిక్ ఉత్పత్తుల సంస్థ డోసన్ డూ సన్ 5000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టుబడులకు ముందు కు వచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు వీలుగా స్కిల్ యూనివర్శిటీని

నెలకొల్పడంతో పాటు రాష్ట్రంలోని యువతలో పారిశ్రామిక అవసరాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించేందుకు, నైపుణ్య ఉద్యోగాలను సాధించేందుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లక్ష మందికి ఈ విధానం ద్వారా ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నది. రాష్ట్ర క్లుప్త నామాన్ని టిఎస్ నుంచి టిజి మార్చడం ద్వారా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో కలిగించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది.రాష్ట్రంలోని ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయడానికి కుల గణన చేపట్టడం ద్వారా సులభతరం అవుతుందని భావించి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ద్వారా దీనిని ఆమోదించడం జరిగింది. గత ప్రభుత్వం విద్యకు సంబంధించి కులాలకు, మతాలకు వేరువేరుగా గురుకులాలను ఏర్పాటు చేయడం ఓటు బ్యాంకు కుల రాజకీయాలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య గోడలను ఏర్పాటు చేసి సామాజిక వైవిధ్యాలను, వాటి ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో కష్టంగా మార్చింది.

కానీ ఈ ప్రభుత్వం కులాలకు అతీతంగా మండల స్థాయిలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు పూనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం, ఫెడరల్ వ్యవస్థలో మంచి సంప్రదాయం. ప్రధానిని రాష్ట్రానికి బడే బాయ్ అని సంభోదించడాన్ని విమర్శిస్తున్న కొందరి చర్యలను గుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదిగా భావించవచ్చు.కేంద్రంతో తెలంగాణ సంబంధాల పునరుద్ధరణ ద్వారా అనతి కాలంలోనే అనేక ప్రయోజనాలు సిద్ధించాయి. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూములు బదలాయింపు జరిగి ఎక్స్‌ప్రెస్ ఎలివేటెడ్ కారిడార్‌కు మార్గం సుగమమైంది. సర్ ప్లస్ బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర గోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయం. మేడిపండు లాంటి మేడిగడ్డ బాగోతంపై కాగ్ రిపోర్టు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలపై కూడా గత పాలకులు అవాకులు చవాకులు మాట్లాడడం నిజంగా విడ్డూరం.

తాజాగా ప్రకటించిన విద్యుత్ పంపిణీ సంస్థల ర్యాంకింగ్‌లో మన విద్యుత్ పంపిణీ సంస్థలు చివరి స్థానంలో నిలవడం గమనార్హం. గత ప్రభుత్వం చెప్పుకుంటున్న విద్యుత్ వెలుగుల వెనక ఉన్న చీకటి వెలుగులను బయటకు తీయడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛా పాలను అందించాలని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆశిస్తూ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News