Thursday, November 21, 2024

దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసట

- Advertisement -
- Advertisement -

తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాధగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

అనాథ బాలికకు అండగా మంత్రి కోమటి రెడ్డి : ఆయన సాయానికి ఎల్లలు లేవు…ఆయన మనసుకు సరిహద్దులు లేవు…ఆయన అందించే తోడ్పాటుకు ఏ స్వార్ధమూ లేదు. ఎవ్వరైనా..ఎక్కడైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్టు తన దృష్టికి వస్తే.తక్షణం సాయం అందిస్తారు. ఇదే సీన్ ఈరోజు మరోసారి రిపీట్ అయ్యింది. ఇంతకీ ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా ఆయన మరెవరో కాదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నిర్మల్ జిల్లా, తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనగాథ గురించి సమాచార మాధ్యమాల్లో చూసిన మంత్రి చలించిపోయారు. తల్లితండ్రులు లేక, ఉండటానికి ఇళ్లు లేక చిన్నారి పడుతున్న కష్టం ఆయన హృదయాన్ని కలిచివేసింది. ఎలాగైనా ఆ చిన్నారికి అండగా నిలవాలని భావించిన మంత్రి స్వయంగా రంగంలోకి దిగి దుర్గకు ఆర్ధిక సహాయం అందేలా చర్యలు చేపట్టారు.

తానుర్ మండల తహసీల్దార్ లింగమూర్తి, యంపీడీఓ అబ్దుల్ సమద్ ద్వారా తన తనయుడి జ్ఞాపకార్ధం నిర్వహిస్తున్న ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. చిన్నారి ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తానని, అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్ళి అయ్యేంత వరకు అండగా ఉంటానని దుర్గకు మాటిచ్చారు. చిన్నారితో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధైర్యపడవద్దని, నేను ఉన్నానని భరోసా కల్పించారు. ప్రతి నెలా ఖర్చుల కోసం పంపుతానని, ఉండడానికి ఇల్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు, త్వరలో పాపను కలుస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమాని స్థానిక నాయకులు సతీష్ రెడ్డి, చిన్నారెడ్డి, కొట్టే కృష్ణ, స్థానిక తాజా మాజీ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ మధు పటేల్, దేవదాసు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News