హైదరాబాద్: ప్రతీ ఎమ్మెల్యే తన జీతం నుండి రూ.25 వేలు పార్టీకి ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సిఎం రేవంత్ అధ్యక్షతన సిఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ ఎమ్మెల్యే తన జీతం నుండి రూ.25 వేలు పార్టీకి విరాళంగా ఇవ్వాలని చెప్పారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని, భయపడే పరిస్థితిలో పార్టీ లేదని సిఎం హెచ్చరించారు. అద్దంకి దయాకర్ లాగా ఓపికతో ఉండాలని.. దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టి.. ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం అన్నారు.
రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే మన టార్గెట్ అని చెప్పారు. సన్నబియ్యంపై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని.. దాన్ని పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తోందని… ఆ పార్టీల కుట్రలను తిప్పి కొట్టాలని సూచించారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్లు ఉంటాయిన.. రెండోసారి గెలవడానికి మీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే పనులను తీసుకురండని.. దగ్గరుండి తానే చేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.