అసదుద్దీన్‌ను కలవాల్సి వస్తే కలుస్తా
రాష్ట్రాభివృద్ధి కోసం దేనికైనా సిద్ధం ఇది ఓల్డ్
సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ త్వరలోనే
గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రికి
శంకుస్థాపన ఆరాంఘర్‌జూపార్కు
ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు మీరాలం
చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తాం ఫ్లైఓవర్
ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీతో కొట్లాడి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలును తీసుకొచ్చినట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరాంఘర్, -జూపార్క్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు సి ఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మా ట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పివి నర్సింహారా వు ఫ్లై ఓవర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారని తా జా గా హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లై ఓవర్‌ను కూడా కాం గ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని సిఎం రేవంత్ తెలిపారు. దీంతో మనకు మనమే పోటీ అని మరోసారి రుజువయ్యిందని ఆయన అన్నారు.
ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నాం
మోడీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడతా, అసదుద్దీన్‌తో కలవాల్సి వస్తే కలుస్తామని సిఎం రేవంత్ తెలిపారు. మనకు మనమే సాటి అని చెప్పుకోవడానికి ఇదొక్కటి చాలని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపా రు. నగర అభివృద్ధి కోసం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. నగర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. మె ట్రో రైలు, రోడ్ల విస్తరణ, శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగుల కు ఉద్యోగాలు కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు సీవరేజీ పనులు ప్రారంభించామన్నారు. మూసీ నదిని పునర్ జీవింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌కు గోదావరి జలా లు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి తాగునీ టి సమస్యలు లేకుండా చేశారన్నారు.హైదరాబాద్ లేక్ సిటీగా ఉం డేదని, నిజాం చేసిన అభివృద్ధిని కాపాడుకుంటే ప్రపంచంలో హైదరాబాద్ బెస్ట్ నగరంగా ఉండేదని ఆయన తెలిపారు. చిన్న వర్షం వచ్చినా ట్రాఫిక్, వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని సిఎం తెలిపా రు.
అక్బరుద్దీన్ చిన్నప్పటి స్నేహితుడని సిఎం రేవంత్ తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ ప్రారంభ సమయంలో మోడీతో మాట్లాడానని, హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం సహకరించాలని కోరానని ఆయన పేర్కొన్నారు. ప్రధాని, తాను వేర్వేరు పార్టీల్లో ఉన్న నగర అభివృద్ధి కోసం, పనుల కోసం మాట్లాడానని ఆయన తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పడితే నగరం మరింత అభివృద్ధి అవుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో కలిపి రీజనల్ రింగ్ రైల్ కూడా కావాలని ప్రధాని కోరానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇది ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని ఆయన పేర్కొ న్నారు. మీర్‌ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని, ఓల్డ్ సిటీ అభివృద్ధికి అక్బరుద్దీన్ అడిగిన పనులకు నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని సిఎం తెలిపారు. ఓల్డ్‌సిటీలో గల్లీ గల్లీ తనకు తెలుసనీ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం శంషాబాద్‌కు మెట్రో రైలును గచ్చిబౌలి నుంచి తీసుకువెళ్లాలని ప్రతిపాదించిందని, కానీ, తాము ఓల్డ్ సిటీ నుంచి మెట్రో శంషాబాద్‌కు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని సిఎం హామీనిచ్చారు.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్ వివరాలు
ఆరాంఘర్ నుంచి నెహ్రూ జులాజికల్ జూపార్క్ వరకు 24 మీటర్ల వెడల్పు, 4.08 కిలోమీటర్ల పొడవు, సుమారుగా రూ.800 కోట్లతో, ఆరు లేన్లతో దీనిని నిర్మించారు. ఇది నగరంలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వారికి ట్రాఫిక్‌ఇబ్బందులు తప్పుతాయి. తాడ్‌బన్, దానమ్మ హట్స్, హసన్‌నగర్ జంక్షన్‌లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పనిలేదు. జూపార్క్‌కు వచ్చే సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం మరింత ఈజీ అవుతుంది.