Thursday, January 30, 2025

ప్రకృతి వనంగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

పర్యాటక పాలసీతో ఎకోటూరిజానికి ప్రోత్సాహం టెంపుల్, హెల్త్,
ఎకో టూరిజానికి ప్రాధాన్యం ఇస్తాం రామప్ప, వెయ్యి స్తంభాల
గుడిలాంటి అద్భుత ఆలయాల నెలవు తెలంగాణ వికారాబాద్
ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం ప్రతి
విద్యార్థి తల్లిపేరిట ఒక మొక్కను నాటి సంరక్షించాలి రంగారెడ్డి
జిల్లా ప్రొద్దుటూరులో ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు ప్రారంభోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి

మన తెలంగాణ/శంకర్‌పల్లి: రాష్ట్రంలో పర్యాటక పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి మంగళవారం సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఒకమంచి ఎకో టూరిజం పార్క్‌ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాల దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నామని, ఆ కొరతను తీర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయని, నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తూ, టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కొల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సంపదను రానున్న తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇక్కడి గాలికి అనేక రోగాలను నయంచేసే శక్తి ఉందని అన్నారు. అనంతగిరికి హవా లాఖో బీమారికి దవా అనే నానుడి ఉందని, టిబిలాంటి రోగులు ఈ ప్రాంతంలో రెండు మూడు నెలలు ఉంటే పూర్తిగా నయం అవుతుందని బలంగా నమ్ముతారని అన్నారు. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా ఎకో టూరిజం పార్కు నిర్వాహకుడు రామ్‌దేవ్ ఈ పార్క్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోందని, వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, సంరక్షించేలా చూడాలన్నారు. ప్రభుత్వ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న అందులో 30 శాతం మాత్రమే బతుకుతున్నాయని, అధిక శాతం ప్రయోజనం చేకూరేలా పర్యావరణవేత్తలు, సంస్థలు, ప్రజలు కృషి చేయాలన్నారు.

ఎక్స్‌పీరియం పార్క్ హైదరాబాద్‌కు
తలమానికం: మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…దేశానికే కాదు..ప్రపంచానికే తలమానికగా నిలిచేలా ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను నిర్వాహకుడిని తీర్చిదిద్దారని ప్రస్తుతించారు. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేవి చారిత్రక కట్టడాలు, ఐకానిక్ భవనాలు, జలాశయాలు, ఉద్యానవనాలలే కాదని, ఇప్పుడు ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కూడా వాటి సరసన చేరుతుందని తెలిపారు. ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సంస్థ గురుంచి తనకు 20 ఏళ్ల కిందటే తెలుసని, తాను నిర్మిస్తున్న ఇంట్లో అప్పుడే ఇలాంటి గొప్ప ప్రకృతి అందాలనిచ్చే మొక్కలు నాటానని, అవి నేడు అవి ఎంతో శోభనిస్తున్నాయన్నారు. ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన కళాఖండాలను ఒక్క చోటికి చేర్చిన రామ్‌దేవ్ రావ్‌ను అభినందించారు. చేవెళ్ల ఎంఎల్‌ఎ కాలే యాదయ్య మాట్లాడుతూ..

ఇలాంటి పార్క్ తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. చిలుకూరు=వికారాబాద్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులను సన్మానించి, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎ మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎంపి సిఎం రమేశ్, ఎక్స్ పీరియం వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రామడుగు రాందేవ్ రావు, పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి శ్రీకాంత్, వనం లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రవి గౌడ్, పొడుగు శ్రీనివాస్, ప్రొద్దుటూరు గ్రామ సీనియర్ నేతలు ఉదయ్ మోహన్ రెడ్డి, బొల్లారం వెంకట్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News