Thursday, January 9, 2025

బొటానికల్ గార్డెన్‌లో పలు ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రారంభించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో పలు ఎకో టూరిజం ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. దీంతో పాటు బొటానికల్ థీమ్ పార్కులు, వర్చువల్ వైల్ లైఫ్ సఫారీ, ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ప్రకృతి అందాలు చెంతకు తెచ్చే అద్భుతమైన వృక్ష పరిచయ కేంద్రాన్ని సిఎం ఆవిష్కరించారు. అలాగే అటవీ పర్యావరణహిత అభివృద్ది కార్యాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. బొటానికల్ గార్డెన్‌లో ఎకో టూరిజం కొత్తగూడెం, పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి, కోదండరెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

బొటానికల్ గార్డెన్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బొటానికల్ గార్డెన్‌ను సందర్శించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులను సీఎం పలుకరించి కరచాలనం చేశారు. దేశంలో తొలిసారిగా సందర్శకులు, విద్యార్థులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన పర్యావరణహిత వృక్ష పరిచయ క్షేత్రంలో 75 రకాల థీమ్ పార్కులు ఏర్పాటు చేశారు. ఈ వృక్ష పరిచయ క్షేత్రంలో సీతాకోక చిలుక వనం, బతుకమ్మ వనం, నౌక వనం, రంగు రంగుల ఆకుల వనం, సూచిక వనం థీమ్ పార్కులు ఆకట్టుకున్నాయి. మద్దివనం, సౌందర్య వనం, అక్షర వనం, వంటింటి వనం, పచ్చి ఎరువుల వనం, అల్ఫా బీట్ వనం, భోజపత్ర వనం థీమ్ పార్కులు చూడముచ్చటగా ఉన్నాయి. మన నిత్య జీవితంలో మనం ఉపయోగించేవి కావడం ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నూతన వాహనాలను ప్రారంభించారు. స్వయంగా వృక్ష పరిచయ క్షేత్రంలో ఎలక్ట్రికల్ వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరగడంతో పాటు వృక్ష పరిచయ క్రేత్రంలో థీమ్ పార్కులను సిఎం సందర్శించారు.

ప్రత్యేక ఎకో టూరిజం పాలసీ తీసుకొస్తున్నాంః మంత్రి సురేఖ
రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రానికి ప్రత్యేక ఎకో టూరిజం పాలసీని తెస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 ప్రముఖ ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నదని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుల్లో ఎకో-టూరిజం ప్రాజెక్టులను పిపిటి విధానంలో చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి కలిసి పార్కులో మంత్రి సురేఖ మొక్కను నాటారు. ఈ కార్యక్రమాల అనంతరం మంత్రి బొటానికల్ గార్డెన్ సిబ్బంది కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు.

స్వయంగా టిజిఎఫ్‌డిసి నూతన వాహనం నడిపిన మంత్రి సురేఖ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (టిజిఎఫ్ డిసి) నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా మంత్రి గారే వాహనం నడిపి అటవీశాఖ సిబ్బందిలో జోష్ ను నింపారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ అటవీశాఖ సాధించిన వార్షిక పురోగతి నివేదికను అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఇవాళ బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

వనమహోత్సవంలో 20.02 కోట్ల మొక్కలు నాటే లక్షం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం ద్వారా 20.02 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని పెట్టుకోగా, ఇప్పటివరకు 16.84 కోట్ల (84%) మొక్కలు నాటడం జరిగిందని మంత్రి సురేఖ తెలిపారు. తెలంగాణ హరితనిధి కింద మంజూరైన రూ.40.67 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ’నగర్ వన యోజన పథకం’ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 14 నగర వనాలను కేటాయించి, వీటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ.18.90 కోట్ల నిధులతో నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ద్వారా 1,738 హెక్టార్ల అటవీ భూమి రిజిస్టర్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ కోర్ ఏరియా నుండి నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించడంతో పాటు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుండి నాలుగు గ్రామాల తరలింపు పనులను వేగవంతం చేసినట్లు ప్రకటించారు.

కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ తో కలిపే 1442.26 చదరపు కి.మీల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అటవీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వన్యప్రాణుల దాడులతో ఎవరైన మరణిస్తే వారి కుటుంబసభ్యులకు అందించే నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలను ప్రభుత్వం పెంచి అందిస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. వన్యప్రాణుల వేట, జంతువుల అక్రమ వ్యాపారాన్ని నివారించడానికి క్యాచ్ ది ట్రాప్ పేరుతో తెలంగాణ అటవీశాఖ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. అడవి జంతువులను వేటాడేందుకు అమర్చిన వలలు, ఉచ్చులు, విద్యుత్ తీగలను నిర్వీర్యం చేసి, అక్రమ వేట బారి నుంచి పెద్ద సంఖ్యలో వన్య ప్రాణులను అటవీశాఖ కాపాడగలిగిందని మంత్రి సురేఖ తెలిపారు. కాంట్రాక్టర్లతో తునికాకు కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, అటవీశాఖ నేరుగా వారి అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నదని తెలిపారు.

‘ఆన్ లైన్ బిఎల్ కలెక్షన్ స్కీమ్’ ను ప్రవేశపెట్టి అక్రమాలను నివారించగలిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024 లో 113 తునికాకు సేకరణ యూనిట్ల పరిధిలో 82,627 మంది తునికాకు సేకరణ కార్మికులు నమోదు చేసుకోగా, వీరికి ప్రభుత్వం రూ.29.40 కోట్లను ఆన్‌లైన్ లోనే చెల్లించిందని అన్నారు. రాష్ట్రంలోని తునికాకు సేకరణ కార్మికులకు నికర తునికాకు సేకరణ ఆదాయంగా రూ.158.49 కోట్లు పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ (ఎన్‌టిపిఎస్) ద్వారా అటవీ అనుమతులను ఆన్‌లైన్‌లో ఇస్తూ దాదాపు 22,954 అనుమతులు ఆన్‌లైన్‌లో జారీ చేసి పారదర్శకతకు పెద్దపీట వేసిందని మంత్రి సురేఖ తెలిపారు.

ఆక్రమణకు గురైన 17,643.30 ఎకరాల అటవీ భూమి స్వాధీనం
ఆక్రమణకు గురైన 17,643.30 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకుని అటవీ భూముల పట్ల అటవీశాఖకు ఉన్న నిబద్దతను నిరూపించుకున్నదని స్పష్టం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ పరిధిలోని సర్కిల్ హెడ్లు, జిల్లా అటవీ అధికారులు జిల్లాల వారీగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో సాధించిన లక్ష్యాలు, విజయాలను ప్రదర్శిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో పచ్చదనం పెంపుదలలో, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అటవీశాఖ సిబ్బందిని, అటవీశాఖ వార్తలతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు మంత్రి సురేఖ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

భవిష్యత్లో అధికారుల సహకారం, సమన్వయంతో అటవీశాఖ ఉన్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. టిజిఎఫ్ డిసి కార్పోరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, పిసిసిఎఫ్(కంపా) సువర్ణ, సిసిఎఫ్ ప్రియాంక వర్గీస్, మీ సేవా కమిషనర్ రవికిరణ్ నాయక్ (ఐఎఫ్‌ఎస్), టిజిఎఫ్ డిసి సిజిఎమ్ వెంకటేశ్వర్ రెడ్డి, జిఎం స్కైలాబ్, ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రంజిత్ నాయక్, అసిస్టెంట్ డైరక్టర్ తనూజ, జూ డైరక్టర్ సునీల్ హెర్మత్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News