Monday, December 23, 2024

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్న కూలీలను సిఎం రేవంత్ రెడ్డి పలకరించారు. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ పనుల పరిశీలనను రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల ప్రజల ప్రేమమూర్తి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శరవేగంగా జరుగుతున్న పనులను ఈరోజు పరిశీలించానని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకుంటున్న శ్రమ జీవులతో పనులు జరుగుతున్న తీరు ఇతర అంశాలపై కాసేపు ముచ్చటించానని సిఎం రేవంత్ ట్వీట్ చేశారు.

విగ్రహ బాధ్యతలు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్‌కు…

కాగా, రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఆగస్టు 28వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. యూపిఏ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన చేసిన రోజు సోనియాగాంధీ జన్మదినం కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో చేయని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తాను చేసి చూపించాలని రేవంత్ రెడ్డి సంకల్పించారు. విగ్రహ రూపకల్పన బాధ్యతను జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News