Monday, December 23, 2024

లోక్‌సభ ఎన్నికలయ్యాక బిజెపిలోకి రేవంత్‌ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి
బిజెపిలోకి వెళ్లడం ఖాయం
రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ అంటుంటే,
సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..?
బిజెపి ప్రభుత్వమా..? అని అర్థం కావడం లేదు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..? బిజెపి ప్రభుత్వమా..? అని అర్థం కావడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అని అంటుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, 40 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిజెపిలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డేనని పేర్కొన్నారు. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయచేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని విమర్శించారు. విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, భయపడే వాళ్లు లేరని అన్నారు.

సామంత రాజులా ఢిల్లీకి రూ.2500 కోట్లు కప్పం కట్టారని, ఇందుకోసం అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారని కెటిఆర్ ప్రశ్నించారు. బిజెపి పార్టీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని చెప్పారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తే హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని, దురదృష్టకరంగా కాంగ్రెస్ చిల్లర ప్రచారాన్ని కొందరు నమ్మారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కవితను అరెస్ట్ చేయలేదని బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటే అని గతంలో కాంగ్రెస్ నేతలు అన్నారని, ఇవాళ పగపట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటుందని ప్రశ్నించారు.

దానం నిర్ణయం తప్పని ఖైరతాబాద్ ప్రజలు నిరూపిస్తారు

బిజెపిని, మోదీని ఆపాలంటే కెసిఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యమని అన్నారు. హైదరాబాద్‌లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారని, బిఆర్‌ఎస్ తరపున పోరాడతామని తెలిపారు. జైశ్రీరాం అనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారని, వాటిని ఆయన కోర్టుకు ఇవ్వాలని అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అత్మహత్యలు మాత్రమే ఉంటాయని, పార్టీ మారిన దానం నాగేందర్ నిర్ణయం తప్పని కెటిఆర్ పేర్కొన్నారు. అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్లారని ఆయన ఆక్షేపించారు. ఖైరతాబాద్ ప్రజలు బిఆర్‌ఎస్‌ను గెలిపించి, దానం నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో పద్మారావు గెలుపుతో బిఆర్‌ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కెటిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News