అభివృద్ధి కోసం భవిష్యత్ లోనూ కేంద్రం సహకారాన్ని కోరుతూనే ఉంటామని.. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గురువారం రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 11.3 కిలో మీటర్లు పొడవున 6 లేన్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమని చెప్పారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు.. ట్విట్టర్ లో పోస్టులు పెట్టుడా? అని సిఎం ఎద్దేవా చేశారు.
మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండని.. ఈ వేదికగా కేటీఆర్ కు తాను సూచన చేస్తున్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలని.. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే కెటిఆర్ ను కంచె వేసి కాపాడుతారని సీఎం రేవంత్ అన్నారు.