హైదరాబాద్: కొంతమంది ప్రజా ప్రతినిధులు ఏ పార్టీలో ఉన్నామని కాకుండా పదవుల్లో ఉండాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సిఎం.. యూనివర్సిటీలు ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల పోరాటాలతోనే చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు. పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వమని, గతంలో సభలో రెండు పక్షాలకు సరైన ప్రాధాన్యం ఉండేదన్నారు. కాలక్రమేణా ఆ స్ఫూర్తిని కోల్పోయామని, తమిళనాడులో అన్ని పార్టీలు ఒకటిగా పనిచేస్తాయని గుర్తు చేశారు. సమస్యలపై తెలంగాణలో కూడా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.