Tuesday, March 18, 2025

అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపలేం

- Advertisement -
- Advertisement -

మంత్రులు, అధికారులపై చర్యలు తీసుకుంటేనే పాలనపై పట్టు ఉన్నట్టా?
ఒక్క ఆరోపణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం రాజీవ్ యువ వికాసం
యువత తలరాత మార్చే పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : అబద్ధాల పునాదుల మీద తాము ప్రభుత్వాన్ని నడపలేమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేండ్లు పాలించిన గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రజాధనాన్ని దుబారా చేసిందని సిఎం ఆరోపించారు. గతపాలకుల దు బారా ఖర్చులను క్రోడీకరించుకుంటూ వాటి ని తగ్గించుకుంటూ క్రమంగా అప్పులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఉపముఖ్యమంత్రి భ ట్టి విక్రమార్క మల్లు, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, విప్‌లు ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, రాంచంద్రనాయక్, బిసి కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ లతో కలిసి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఒక్క ఇసుక అమ్మకాలలోనే రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగిందని, జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదైందని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉండడం విశేషమన్నారు.

ఐదు లక్షల మందికి ఉపాధి లక్షం
రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువత ఉపాధికి భరోసాకల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రూ.6 వేల కోట్లతో ఐదు లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని మా నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చెప్పారని, కులగణన నిర్వహించి ఈరోజు బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్నాం, కులగణనలో బిసిల లెక్క 56.36 శాతంగా తేలింది, వారికి 42 శాతం రిజర్వేషన్లు అందజేస్తామని చెప్పారు. ఎస్సీల వర్గీకరణ కోసం 35 ఏళ్లుగా ఉద్యమం సాగుతోంది. దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాం.

తొలిఏడాదిలోనే 54వేల ఉద్యోగాల భర్తీ
తమ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి యువతలో ఉత్సాహాన్ని నింపామన్నారు. రాష్ట్రంలో 50లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలోనే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు 1.20 కోట్ల నాణ్యమైన చీరలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

మంత్రులను తొలగిస్తేనే.. పట్టు ఉన్నట్టా ?
కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తనకు నాకు పరిపాలన అనుభవం లేదని, పాలనపై పట్టు రాలేదని అంటున్నారు. మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే.. పట్టు ఉన్నట్టా? అధికారులను తొలగించడం, బదిలీలు చేయడం వంటివి చేస్తేనే పాలనపై పట్టు సాధించినట్లు అవుతుందా ? అని సిఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడమే మా లక్ష్యం అని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు, ఆరోపణలు లేకుండా ప్రభుత్వ కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, ప్రభుత్వ పథకాల అమలులో ఎంతో పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యేలను నిర్దేశిస్తూ నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అమలుచేయాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు.

యువత తలరాతను మార్చే పథకం
రాజీవ్ యువ వికాసం పథకం రాష్ట్రంలో యువత తలరాతను మార్చే పథకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు లబ్ధి చేసే విధంగా రాజీవ్ యువ వికాసం పథకం రూపకల్పన చేసినట్లు ఆయన చెప్పారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అందరికి మంజూరు పత్రాలు ఇచ్చే విధంగా క్యాలెండర్ ను ఖరారుచేశామన్నారు. అన్నిశాసనసభ నియోజకవర్గాల పరిధిలో రూ.6వేల కోట్లతో 5లక్షల నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ జారీ 16.03.2025
ధరఖాస్తుల స్వీకరణ 17.03.2025 నుంచి 05.04.2025
(ఆన్‌లైన్, మండల ఆఫీసులు,ప్రజాపాలన సేవ కేంద్రాల ద్వారా)
లబ్దిదారుల ఎంపిక 06.04.2025 నుంచి 30.04.2025
మంజూరు పత్రాల ప్రదానం 02.06.2025

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News