Sunday, November 17, 2024

సిఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఆన్‌లైన్ స్వీకరణకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది. అందులో భాగంగా ఆన్‌లైన్ లింక్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని ప్రభుత్వం కేటాయించింది. వారి వద్దకు వెళితే సిఎంఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేషెంట్ల వివరాలు నమోదు చేస్తారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా? కాదా అనే వివరాలను తెలుసుకోవడానికి పోర్టల్‌లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సిఎంఆర్‌ఎఫ్ పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సిఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లీంపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.

ఈ లింక్ ద్వారా దరఖాస్తు…
ఇక నుంచి ముఖ్యమంత్రి ప్రావిడెంట్ ఫండ్ దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీలు సిఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయనున్నారు. దరఖాస్తును అప్‌లోడ్ చేసిన తర్వాత సిఎంఆర్‌ఎఫ్‌కి సంబంధించిన కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సెక్రటేరియట్‌కు సమర్పించాలి. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, సిఎంఆర్‌ఎఫ్ దరఖాస్తు ఆమోదిస్తారు. అనంతరం లబ్దిదారునికి చెక్కు తయారవుతుంది. దరఖాస్తుదారు ఖాతా నంబర్ చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు. https://cmrf.telangana.gov.in/ ఈ లింక్ ద్వారా దరఖాస్తును పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News