మనతెలంగాణ / హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్‌ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్‌ను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
గత ప్రభుత్వ హయాంలో సీ ఎంఆర్‌ఎఫ్ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయాల్సిఉంటుంది. సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు.
ఆ కోడ్ ఆధారం ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందచేయాల్సి ఉంటుం ది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్‌ను ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉం డదు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారుల అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.https//cmrf.telang లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.