Friday, November 15, 2024

మోడీజీ.. వచ్చి రైతులను తెల్సుకోండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీపై మా వాగ్దానాన్ని నెరవేర్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 27 రోజుల్లో 22.22 లక్షల రైతులకు చెందిన రూ.17,869 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా రుణమాఫీపై ప్రధాని చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, ఆ విషయం మీరొచ్చి అడిగితే ఏ రైతు అయినా చెప్తారంటూ ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ఘాటు లేఖ రాశారు. తెలంగాణలో రైతుల రుణమాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రస్తావించారని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రుణమాఫీని విజయవంతంగా అమలు చేశామని, పథకం అమలు గురించిన వాస్తవాలను ప్రధానితో పంచుకోవాలని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. రుణమాఫీని తమ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో లేఖ ద్వారా ప్రధాని మోడీకి సిఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ వాగ్దానాన్ని నెరవేర్చిందని, క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా వచ్చిన ప్రధాని ప్రకటన వేదనకు, ఆశ్చర్యానికి గురి చేసిందని సదరు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో రూ.2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. తొలుత 2024 జులై 18న లక్ష వరకు రుణాలున్న 11,34.412 మంది రైతుల ఖాతాలకు రూ.6,034.97 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. తర్వాత జులై 30వ తేదీన 6,40,823 మంది రైతుల రుణ ఖాతాలకు రూ.6,190.01 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందని పేర్కొన్నారు.

ఆగస్టు 15వ తేదీన 4,46,832 మంది రైతుల రుణ ఖాతాలకు రూ.17,869.22 కోట్లు బదిలీ చేసిందని వెల్లడించారు. 27 రోజుల వ్యవధిలోనే 22,22,067 మంది రైతులను రుణవిముక్తులను చేశామని పునరుద్ఘాటించారు. రైతులపై రుణ భారం లేకుండా చూడడంతో పాటు రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదకత పెంచడంలో వారిని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేందుకు రుణమాఫీనే నిదర్శనమన్నారు. రుణమాఫీ రైతులను బలోపేతం చేయడమే కాదు, వారిలో నైతిక స్థైర్యాన్ని నింపుతుందని మేం గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు. రూ.2లక్షలకు పైగా రుణాలు ఉన్నవారికి రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. రూ.2లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను మేం మాఫీ చేస్తామని సదరు లేఖలో వెల్లడించారు. రుణమాఫీ కోసమే మా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో రూ.31 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణ రైతులకు మద్దతు ఇవ్వాలని మీకు మేం విజ్ఞప్తి చేస్తున్నాని వెల్లడించారు. రాష్ట్రంలో సాగురంగంపై ఆధారపడిన వారు మోస్తున్న ఆర్థిక భారాన్ని ఉపశమనం కలిగించేందుకు సహకరించండని కోరారు. రైతుల ఆత్మస్థయిర్యాన్ని తగ్గించే బదులు మనం కలిసి వారిలో ఆత్మస్థయిర్యం పెంపొందించేందుకు ప్రయత్నిద్దామన్నారు. రైతుల రుణమాఫీకి చెందిన పూర్తి వివరాలను తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి పారదర్శకతతో ఉంచామన్నారు. రుణమాఫీ ద్వారా మా అంకిత భావాన్ని చాటుకున్నామన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా రుణమాఫీ నిలుస్తుందన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమానికి మీ పూర్తి సహకారాన్ని కోరుతున్నామని సదరు లేఖలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News