Sunday, January 19, 2025

సమ్మక్క సారక్క సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి అబద్దమాడారు

- Advertisement -
- Advertisement -

60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిఎం పచ్చి అబద్దం చెప్పారు
సిఎం రేవంత్ తీరు అయిపోయిన పెళ్ళికి బాజా కొట్టినట్టు ఉంది
కెసిఆర్ హాయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లను రేవంత్ రెడ్డి తనవిగా ఎలా చెప్పుకుంటారు?
అమ్మ వారి సాక్షిగా అబద్దాలాడినందుకు సిఎం రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి
గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ  రూ.500కే సిలిండర్ పథకం వర్తింపజేయాలి
బిఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్

మనతెలంగాణ/హైదరాబాద్ : సమ్మక్క సారక్క సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి అబద్దమాడారని బిఆర్‌ఎస్ హైదరాబాద్ ఇంఛార్జ్ దాసోజు శ్రావణ్ ఆరోపించారు. 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిఎం పచ్చి అబద్దం చెప్పారని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క సాక్షిగా సిఎం రేవంత్ నయవంచనకు పాల్పడ్డారని విమర్శించారు. సిఎం రేవంత్ తీరు అయిపోయిన పెళ్ళికి బాజా కొట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కెసిఆర్ హాయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లను రేవంత్ రెడ్డి తనవిగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కెసిఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కలిపితే ఎలా? అని అడిగారు.

అమ్మ వారి సాక్షిగా అబద్దాలాడినందుకు సిఎం క్షమాపణ చెప్పాలని డిఆమండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నాయకులు పల్లె రవికుమార్, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమతో మోసగించబడాలనుకుంటారు అని సిఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, ఇప్పుడు ఆయన తీరు అలానే ఉందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో 13 హామీలున్నాయని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నాడు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని చెబుతున్నారని అన్నారు. రూ.500కు సిలిండర్ ,200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఉచిత విద్యుత్ అన్నారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రస్తుతం 40 లక్షల మందికే ఉచిత రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. ప్రజా పాలన కింద ఎంతమంది రూ. 500కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదని, తెల్లరేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో కూడా చెప్పడం లేదని అన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఈ పథకం వర్తిస్తుంది అంటున్నారని చెప్పారు. అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే ఇస్తామంటున్నారని విమర్శించారు. సంవత్సరానికి 3 నుంచి 5 సీలిండర్లు ఇస్తామంటున్నారని, ఇది దగా, మోసం కాదా? అని నిలదీశారు.

డొంక తిరుగుడు నిబంధనలు పెట్టడం సరికాదు
కాంగ్రెస్ నాయకులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు, కాంగ్రెస్ ఎంఎల్‌ఎను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని దాసోజు శ్రవణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుక పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ రూ.500కే సిలిండర్ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ముందు డబ్బులు వినియోగదారుడు కట్టాలి తర్వాత సబ్సిడీ ఇస్తామనేది సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 34 లక్షల 48 వేల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కోటి ఐదు లక్షల మంది 200 యూనిట్ల లోపే విద్యుత్ వాడుతున్నారని చెప్పారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడే వారందకీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డొంక తిరుగుడు నిబంధనలు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.కరెంటు కోతలకు కొందరు అధికారులే కుట్ర పన్నారని సిఎం రేవంత్ అంటున్నారని, కరెంటు కట్ చేస్తే కొలువులు తీసేస్తా అని కూడా చెప్పారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో కనురెప్ప కొట్టుకునే సమయం కూడా కరెంటు పోలేదని, రేవంత్ రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయని ప్రశ్నించారు.

రేవంత్ తన చేతకాని తనాన్ని, అసమర్ధతను చిన్న ఉద్యోగులపై ఫత్వాలుగా జారీ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ప్రజలు గ్రహించాలని కోరారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రి అని, కరెంటు పోయినందుకు ఆయన్ను కూడా సిఎం రేవంత్‌ రెడ్డి సస్పెండ్ చేస్తారా? అని అని అడిగారు. రైతుబంధుపై ఇప్పటి దాకా మీన మేషాలు లెక్కపెడుతున్నారని, సిఎం రేవంత్‌ రెడ్డి రైతు నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఆటోడ్రైవర్లు ఇప్పటిదాకా 30 మంది చనిపోయారని, వారి సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల పండించిన పంటకు బోనస్ ఇస్తామన్నారని, అది కూడా లేదని పేర్కొన్నారు. హడావుడిగా హామీలు ఇచ్చినంత శ్రద్ధ వాటి అమలుపై లేదని విమర్శించారు. తాము రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపైన నిలదీస్తూనే ఉంటామని అన్నారు.

Dasoju 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News