ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో
సిఎం రేవంత్ భేటీ, పలు అంశాలపై చర్చ
చేరికలు, ఎంపి సీట్లపైనా కసరత్తు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజూలో భాగంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సిఎం రేవంత్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. అయితే కెసి వేణుగోపాల్‌తో జరిగిన భేటీలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన ఆరు పథకాల అమలు, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, తదితర అంశాల గురించి చర్చించినట్టుగా తెలిసింది.నామినేటెడ్ పదవుల భర్తీపై ఇటీవల హస్తం పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరికలు పెరగడం, మరికొందరు నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉండటం గురించి ఆయన కెసి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం.
అదేవిధంగా శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్ రాని నాయకులకు, పార్టీ గెలుపునకు పని చేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా కెసి సలహాలు, సూచనలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సిఎం కొన్ని పేర్లను కెసి వేణుగోపాల్‌కు సూచించగా ఆయన కొన్ని సూచనలు చేసినట్టుగా సమాచారం. దీంతోపాటు లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అంశంతో పాటు టికెట్ దక్కని అసంతృప్తులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అంశాన్ని కూడా కెసి వేణుగోపాల్‌తో చర్చించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సోమవారం ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్ రాత్రి ఏఐసిసి అధికార ప్రతినిధి సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరు అయ్యారు. మంగళవారం కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సమావేశమైన సిఎం అనంతరం కెసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీ నుంచి ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.