Saturday, February 8, 2025

పిసిసి కార్యవర్గానికి గ్రీన్‌సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల్లో ప్రకటన నలుగురు
వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి
అవకాశం మాదిగ, ముస్లిం,
లంబాడ, రెడ్డి వర్గాల వారికి ఛాన్స్
15 నుంచి 20 మంది ఉపాధ్యక్షులు
మంత్రివర్గ విస్తరణపై సిఎం,
డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ నుంచి
విడివిడిగా అభిప్రాయాలు సేకరించిన
ఎఐసిసి కార్యదర్శి వేణుగోపాల్
ఖర్గేతో సిఎం, డిప్యూటీ సిఎం భేటీ
కులగణన నివేదిక సమర్పణ
వర్గీకరణ ప్రక్రియను వివరించిన
రాష్ట్ర నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి కార్యవర్గ కసరత్తు కొలిక్కి వచ్చింది. ఈ రెండు రోజుల్లో ఏఐసిసి నుం చి స్పష్టమైన ప్రకటన వస్తుందని సమాచారం. అందులో భాగంగానే శుక్రవారం టి కాంగ్రెస్ నేతలతో కెసి వేణుగోపాల్ చర్చలు జరిపారు. రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. సిఎం రేవంత్‌రెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీలతో ఆయన చర్చించారు. పిసిసి కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణపై నేతల అభిప్రాయాలను కెసి వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నా రు. పిసిసి కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.

ఒకటి, రెం డు రోజుల్లో అధికారికంగా పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనుండగా అందులో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని ఒక మాదిగ, ఒక ముస్లిం, ఒక లంబాడా, ఒక రెడ్డి వర్గాలతో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు 15 నుంచి- 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉందని, అలాగే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసిసి సూచించినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నా మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ నేత ల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం సేకరించినట్టుగా తెలిసింది. అధిష్టానం ఒక్కొక్కరితో చర్చించి అభిప్రాయాలను సేకరించినట్లుగా సమాచారం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుందని, కానీ ఇప్పుడే విస్తరణకు అవకాశం మాత్రం లేదంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటుండడం విశేషం.

ఖర్గేతో సిఎం, డిప్యూటీ సిఎంల భేటీ
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదికను సైతం ఆ పార్టీ అధిష్టానానికి సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందజేశారు. ఈ నివేదికను శాస్త్రీయంగా, సమగ్రంగా రూపొందించామని ఖర్గేకు వారు వివరించారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యూడిషియల్ కమిటీ ఆమోదించిన తర్వాతే కేబినెట్‌లో ఆమోద ముద్ర వేసినట్లు వారు ఆయనతో పేర్కొన్నారు. ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్రంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సభకు రావాలని ఖర్గేను వారు ఆహ్వానించారు.

6 మంత్రి పదవుల కోసం 10 మంది పోటీ
6 మంత్రివర్గ ఖాళీల భర్తీ కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు 10 మంది పోటీపడుతున్నారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం పోటీపడుతున్న పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో నిజామామాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి తప్పనిసరిగా అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సామాజిక సమీకరణలు కుదిరితే ఆ జిల్లాల నుంచి సైతం నేతలకు అవకాశం దక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక, బిసి సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒకరిని కేబినెట్‌లోకి తీసుకుంటామని శ్రీహరిని దృష్టిలో పెట్టుకునే సిఎం రేవంత్ ప్రకటించారని ఆ వర్గం నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మైనార్టీలు లేకపోవడంతో ఎమ్మెల్సీ అమీర్‌అలీ ఖాన్‌కు అవకాశం దక్కుతుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్‌లు ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి పార్టీ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని టాక్. విస్తరణ జరిగితే తమకు మంత్రి పదవులు తప్పకుండా ఇవ్వాలని ఆ ఇద్దరు ప్రస్తుతం ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలిసింది.

జిల్లాల వారీగా ఆశావాహులు
ఆదిలాబాద్ : ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి
రంగారెడ్డి : మల్‌రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్‌రెడ్డి
నిజామాబాద్ : సుదరన్‌రెడ్డి
నల్లగొండ : బాల్‌నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి,
మహబూబ్‌నగర్ : వాకిటి శ్రీహరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News