Wednesday, January 15, 2025

ప్రాజెక్టులకు సహకరించండి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ముగ్గురు కేంద్రమంత్రులకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి
ట్రిపుల్ ఆర్ మొత్తానికి కేంద్ర
కేబినెట్ ఆమోదం తెలపాలి
రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్2,
మూసీ రివర్‌ఫ్రంట్‌కు నిధులు ఇవ్వాలి
కిషన్‌రెడ్డికి రేవంత్ విజ్ఞప్తి రీజినల్
రింగ్ రోడ్డుకు సాంకేతిక, ఆర్థిక
అనుమతులు ఇప్పించాలని మంత్రి
గడ్కరీకి అభ్యర్ధన కేంద్రీయ
విద్యాలయాలు కేటాయించాలని
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వినతి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. ఒకే రోజు ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై ఏకరువు పెట్టారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులతో పాటు ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్‌గడ్కరీ, ధర్మేంద్ర ప్రదాన్‌లను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలను అందించారు. మూసీ గోదావరి లింక్, హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌కు చేయూత ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. రీజనల్ రింగు రోడ్డుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇప్పించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రదాన్‌ను సిఎం కోరారు.

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ ర కాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), హైద్రాబాద్ మెట్రో ఫేజ్ 2 తోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రె డ్డిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కలిశా రు. ఈ సందర్భంగా మొత్త రూ.1,63,559. 31 కో ట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావాల్సిన చేయూతపై కేంద్ర మంత్రితో ముఖ్యమం త్రి చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లా రు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం

భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగానికి ఇంకా అనుమతి ఇవ్వని విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలతో పాటు ఇండస్ట్రియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయని సీఎం అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ రెండు వైపులా పూర్తికి ఈ రహదారికి సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు అని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఓఆర్‌ఆర్- ఆర్‌ఆర్‌ఆర్‌ల అనుసంధానానికి రేడియల్ రోడ్లు నిర్మించాలని సంకల్పించామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10 గ్రీన్‌ఫీల్ రోడ్లతో పాటు ఓఆర్‌ఆర్ అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు వ్యయమవుతాయని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

మెట్రో ఫేజ్‌ను 2కు చేయూత
మెట్రో ఫేజ్ 2 లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్- పటాన్ చెరు, ఎల్‌బీ నగర్ హయత్ మొత్తం 76.4 కి.మీల నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో మెట్రో ఫేజ్‌ను 2 చేపట్టేందుకు కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించాలి :
మూసీరివ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ ప్రిధిలోని 222.27 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఇప్పటికే కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ భూముల బదలాయింపుతో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశామని, నిధుల మంజూరుతో పాటు అనుమతులకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగు నీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ మొత్తం నిధుల విడుదలకు సహకరించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నగరంతో పాటు సమీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కి.మీ.మేర సీవరేజీ నెట్‌వర్క్ పనులకు రూ.17,212.69 కోట్లతో సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అమృత్ 2 లేదా ప్రత్యేక ప్రాజెక్టు కింద దానిని చేపట్టేందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.

అలాగే తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూపకల్పన చేశామని, రూ.4.170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టాని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ అయిన సింగరేణి ప్రత్యక్షంగా 43 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. దీర్ఘకాలం పాటు సింగరేణి సంస్థ మనుగడ సాగించేందుకు గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు హైదరాబాద్ అనువుగా ఉందని, నిపుణులైన కార్మికులు, మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను పరిగణనలోకి తీసుకుఇని తెలంగాణను సెమీకండ్రక్టర్ మిషన్‌లో చేర్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

ఆర్‌ఆర్‌ఆర్‌కు సహకరించండి
రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమావేశమయ్యారు. 2017లోనే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంద,ఇ మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.

ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని,ఇందుకు 2024- 25 బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్- విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారవుతామని చెప్పారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఛత్తీస్‌ఘడ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్-63 (16) వరంగల్ హన్మకొండ నగరాల మధ్య వెళుతోందని, ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కల్లుపుతూ బైపాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలో. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, నల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, మల్లు రవి, కడియం కావ్య, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్ రెడ్డి ఉన్నారు.

కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి
తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదని, కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాకు వాటిని కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తోందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఓసీ తీసుకునేలా చూడాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News