మల్కాజ్‌గిరి పార్లమెంట్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ స్థాయికి చేరానంటే ఆ గొప్పతనం మల్కాజ్ గిరి ప్రజలదేనని తెలిపారు. మల్కాజ్ గిరి గెలుపు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని పేర్కొన్నారు. ఆనాడు నేతలు అమ్ముడుపోయినా కార్యకర్తలు తనను ఢిల్లీకి పంపారని చెప్పారు. వంద రోజుల పాటు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామన్నారు.
మల్కాజ్ గిరి పరిధిలో స్వైవేలకు శంకుస్థాపన చేశామని సిఎం చెప్పుకొచ్చారు. మెట్రో, ఎంఎంటీఎస్, జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యలు తీరాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మల్కాజ్ గిరి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. హోలీలోపు లోక్ సభ అభ్యర్థుల ప్రకటన వస్తుందన్న ముఖ్యమంత్రి కష్టపడినవారిని ప్రభుత్వంలో భాగస్వాములు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మల్కాజ్ గిరి ప్రచార మోడల్.. రాష్ట్రమంతా అనుసరించేలా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.