Wednesday, January 22, 2025

సరిహద్దులో సైన్యంలా రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సరిహద్దులో సైన్యంలా రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా ఉండాలి
సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లలకు ప్రత్యేక స్కూల్స్
రాజకీయ నిఘా కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలి
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలి
పోలీసు అధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఒకప్పుడు గుడుంబా పెద్ద సమస్యని, ఇప్పుడు అది లేదని, ప్రస్తుతం పల్లె, పట్టణం తేడా లేకుండా డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటామని, ఆ పిల్లలే డ్రగ్స్ బారిన పడితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఎవొబి) నుంచి గంజాయి వస్తోందనే సమాచారం ఉందని తెలిపారు. చొరబాట్లు, ఇతర సమస్యలు రాకుండా దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంటుందో, పహారా కాస్తుందో, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు అలా అప్రమత్తంగా ఉండి, పహారా కాసి తెలంగాణలోకి గంజాయి మొక్క, డ్రగ్స్ రాకుండా చూడాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్(సిసిసి)లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో సిబిసిఐడి, ఎసిబి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి విభాగాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నందున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటయ్యాయన్నారు.

మితి మీరిన భద్రత వద్దు…
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టి నేరగాళ్లను పట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సమాజంలో ఉన్న ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజా ప్రతినిధులుగా వచ్చామని, తమకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదని, ఎవరికి ఎంత అవసరమో అంతే సెక్యూరిటీ ఇవ్వాలని, భద్రత విషయంలో తనతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని డిజిపికి స్పష్టం చేశారు.

భద్రత, ఇతర విషయాల్లో కొన్ని సార్లు పోలీసుల అతి ఉత్సాహం చూపుతారని, ఆ ఉత్సాహం, శక్తి నేరాల నియంత్రణపై చూపాలని హితవు పలికారు. పోలీసు కుటుంబాల పిల్లలు రాణించలేరనే అపవాదు సమాజంలో ఉందని, ఇందుకు ప్రధాన కారణం వీధుల్లో పడి కుటుంబాలకు, పిల్లలకు సరైన సమయం కేటాయించకపోవడమే కారణమన్నారు. సామర్థం, పనితీరుతోనే బదిలీలు కోరుకోవాలని సూచించారు. సామర్థం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకు సందీప్ శాండిల్య ఉదాహరణ, తన ప్రభుత్వంలో రిటైర్ అయిన వారిని పదవీ కాలం పొడిగించిందని ఒక్క సందీప్ శౌండిల్యకేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

నేను పోలీసు కుటుంబం నుంచే వచ్చా…
పోలీసుల పిల్లలు తాము పోలీసుల కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకునేందుకు ఇబ్బంది పడతారని, అందుకు కారణం పోలీసు శాఖపై సమాజంలో ఉన్న అభిప్రాయమేనన్నారు. ఆ అభిప్రాయం మారాలని, తన తండ్రి, తన అన్న పోలీసు అని గర్వంగా చెప్పుకునేలా మన ప్రవర్తన ఉండాలని ఆయన సూచించారు. తన అన్న భూపాల్‌రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్‌గా పని చేసి తనను చదివించారని, తన అన్న పెంపకంతోనే తాను ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని ఆయన వెల్లడించారు.

తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్
తెలంగాణ బ్రాండే హైదరాబాద్ అని, హైదరాబాద్ పోలీసు అంటే తెలంగాణకు గుండెకాయ అని అన్నారు. నగరంలో నేరాలను నియంత్రించక పోతే, అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. పోలీసులు అంతా తమ బాధ్యతను ప్రతి రోజు గుర్తు పెట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని కాపాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డిజిపి రవి గుప్తా, ఇంటెలిజెన్స్ అడిషినల్ డిజిపి బి.శివధర్‌రెడ్డి, టిజి న్యాబ్ డిజి సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News