Wednesday, March 5, 2025

కొత్త కార్డులు ఇస్తున్నాం.. కోటా పెంచండి

- Advertisement -
- Advertisement -

 రూ.1891కోట్ల బకాయిలు విడుదల చేయండి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ గడువు
పొడిగించండి పిఎం కుసుమ్ కింద నాలుగు వేల మెగావాట్ల సోలార్
విద్యుత్ ఉత్పత్తి అనుమతులు పునరుద్ధరించండి ఢిల్లీలో కేంద్ర మంత్రి
ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కు 201415 ఖరీఫ్ కాలం లో సరఫరాచేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆ హార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జో షికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మంగళవారం కలిశారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. బకాయిలు పెట్టి పదేళ్లయినందున వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.
సిఎంఆర్ గడువును నాలుగు నెలలు పొడిగించాలి
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రికి సిఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. 2021, జూన్ నుంచి 2022, ఏప్రిల్ వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని వారు కోరారు. సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) గడువును నెల రోజులు కాకుండా కనీసం నాలుగు నెలలు పొడిగించాలని, అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్ర మంత్రి జోషికి తెలియజేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన కోటా పెంచాలని సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

4 వేల మెగావాట్ల మంజూరును పునరుద్ధరించాలి
తెలంగాణకు పిఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గతంలో నాలుగు వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందని కేంద్ర మంత్రి దృష్టికి సిఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామని కేంద్రమంత్రికి వివరించారు. పౌరసరఫరాల శాఖ బకాయిల విడుదల, 4 వేల మెగావాట్ల మంజూరు పునరుద్ధరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News