Monday, July 8, 2024

బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షాలతో సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ప్రాజెక్టులు, బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు ఇతర అంశాలపై మోడీతో వారిద్దరూ చర్చించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రధానిని కోరారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్, నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రధాని దృష్టికి తీకెళ్లారు. విభజన హామీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎంలు కలిశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధానమంత్రి నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎంలు సుమారు గంటసేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎంలు కలిసి పలు సమస్యలపై చర్చించారు.

ప్రధానికి విజ్ఞప్తి చేసిన అంశాలు ఇలా…
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసిఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 41 శాతం వాటాలున్నట్లు ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండిఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం,

సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికే కేటాయించాలని ప్రధానమంత్రి మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమైనందున, సింగరేణికే వాటిని కేటాయించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 2010 సంవత్సరంలో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూతన కంపెనీలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించిందన్నారు. 2014 తర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగలేదని, హైదరాబాద్‌కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలని పిఎంను సిఎం కోరారు.

కోచ్ ఫ్యాక్టరీ… ఐఐఎంలు కావాలి…
ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే హైదరాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉందని సిఎం తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో కాకుండా మరెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామన్నా ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని సిఎం కోరారు.

రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోడీకి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బదులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని సిఎం రేవంత్ ప్రధాని మోడీతో తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం సరికాదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నెలకొల్పాలి….
ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలని ప్రధానమంత్రి మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనపర్చుతున్నట్లు మోడీకి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

తెలంగాణకు ఇళ్లు కేటాయించండి…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (పిఎంఏవై) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూరయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పిఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూరయ్యాయని సిఎం వివరించారు. 2024-, 25 నుంచి ప్రారంభమవుతున్న పిఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకు న్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. పిఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధి,విధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

బిఆర్జీఎఫ్ నిధులు రూ.1800 కోట్లు ఇవ్వండి..
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బిఆర్‌జిఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అయిదేళ్లలో తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించిందని ప్రధానమంత్రి మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశారని, 2019,-20, 2021,-22, 2022,-23, 2023,-24 సంవత్సరాలకు సంబంధించి బిఆర్‌జిఎఫ్ కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

రక్షణ శాఖ భూములను బదిలీ చేయండి…
హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ టు -కరీంనగర్ రహదారి, హైదరాబాద్- టు నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్‌ఏఐ-44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి తెలియజేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిఎం కోరారు. ఆ కారిడార్‌లతో పాటు హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రధానమంత్రి మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్‌ఐసి) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రధానమంత్రి మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయని, వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి..
భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఆ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వడంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ రహదారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని సిఎం కోరారు. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగంగా ఉండే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి, వెంటనే భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ రహదారులుగా గుర్తించండి….
తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల-, పెద్దపల్లి-, కాటారం, డిండి-, దేవరకొండ-మల్లెపల్లి-, నల్గొండ, భువనగిరి-, చిట్యాల, చౌటుప్పల్ అమన్‌గల్, షాద్‌నగర్, -సంగారెడ్డి, మరికల్-, నారాయణపేట, రామసముద్ర, వనపర్తి-కొత్తకోట, -గద్వాల మంత్రాలయం, మన్నెగూడ, -వికారాబాద్-, తాండూరు, -జహీరాబాద్, -బీదర్, కరీంనగర్, -సిరిసిల్ల- కామారెడ్డి-, ఎల్లారెడ్డి-, పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-, గద్వాల-, రాయచూరు, కొత్తపల్లి-, హుస్నాబాద్,- జనగాం,- హైదరాబాద్, సారపాక,- ఏటూరు, నాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇచ్చిన అంశాలు…..
రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టిజి న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజి సిఎస్‌బి) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణతో పాటు అరికట్టడానికి కావల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం టిజి న్యాబ్‌కు రూ.88 కోట్లు, టిజి సీఎస్‌బికి రూ.90 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఐపిఎస్ కేడర్ సమీక్ష చేయడం తప్పనిసరని, తెలంగాణకు సంబంధించి 2016లో మొదటిసారి సమీక్ష నిర్వహించారని, నాటి నుంచి సమీక్ష చేయనుందున వెంటనే సమీక్ష చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపిఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపిఎస్‌లు సరిపోనందున, తెలంగాణకు అదనంగా మరో 29 ఐపిఎస్ పోస్టులు కేటాయించాలని సిఎం విజ్ఙప్తి చేశారు.

పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్రల్లో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన క్యాంపులను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గతంలో ఉండి తొలగించిన మూడు జిల్లాలను ఎస్‌ఆర్‌ఈ కింద (భద్రతాపరమైన వ్యయం, చెల్లింపులు) తిరిగి కొనసాగించాలని సిఎం కోరారు. సరిహద్దు రాష్ట్రాలతో విశాలమైన సరిహద్దు ఉండటంతో తెలంగాణ భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

సిఆర్‌పిఎఫ్, జేటిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సిఆర్‌పిఎఫ్, జేటిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రె గుట్టల కొండల్లో ఉన్న అనుకూలతను ఆసరాగా చేసుకొని సిపిఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి తమ ప్రాబల్య విస్తరణకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టు ప్రత్యేక దళం కదలికల నియంత్రణతో పాటు నిర్మూలనకు జేటిఎఫ్ క్యాంపులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ఎస్పీఓలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాలని సిఎం కోరారు. మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎస్పీఓల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన సమాచారం చేరవేతకు ఇబ్బందిగా ఉందన్నారు. 1065 మందిని ఎస్పీఓల్లో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని సిఎం కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులు అందుబాటులో లేరని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.

పునర్విభజన చట్టం…
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ 9లోని (చట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ పదిలోని సంస్థల వివాదం (చట్టంలోని 75 సెక్షన్ ప్రకారం) సామరస్యపూర్వకంగా పరిష్కారానికి కృషి చేయాలని సిఎం కోరారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున, అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News