Sunday, November 24, 2024

రాష్ట్ర రాజకీయాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలే లక్షంగా కేంద్రంతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నామని, అందులో భాగంగానే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి పలు సమస్యలపై విజ్ఞప్తి చేశామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానిని, కేంద్రహోంమంత్రిని కలిసిన అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా విభజన చట్టంలోని అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని, హోం మంత్రులతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెడింగ్ బిల్లులను, సంక్షేమ కార్యక్రమాలను గురించి రాత పూర్వకంగా వినతి పత్రం ఇచ్చామని సిఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి వినతి పత్రం ఇచ్చామన్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విరక్తి చెందారని ఆ పార్టీపై విరక్తితో ‘ఇండియా’ కూటమికి ప్రజలు ఓట్లేశారన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

పిసిసి చీఫ్, కేబినెట్ విస్తరణ అంశాలపై హైకమాండ్‌దే తుది నిర్ణయం
పిసిసి చీఫ్, కేబినెట్ విస్తరణ అంశాలపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని, మంత్రి వర్గ విస్తరణ ఏఐసిసి పెద్దల పరిశీలనలో ఉందని సిఎం రేవంత్ అన్నారు. పిసిసి చీఫ్, కేబినెట్ విస్తరణపై మీడియాలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోందని సిఎం అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధ్యాయం ముగిసిందని, ఆ పార్టీది గతమేనని, భవిష్యత్ లేదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కోసం ప్రజలు దోలాడుకుంటూ పోవడం కాదు, అసలు ఆ పార్టీ ఎక్కడ ఉందని ప్రజలు టార్చ్‌లైట్ వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సిఎం రేవంత్ అన్నారు. ఇన్నేళ్లలో ప్రస్తుతం ఇంతటి దీనావస్థలో గతంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ లేదన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ 23 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైమ్ లోక్‌సభలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయిందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. బిఆర్‌ఎస్, బిజెపిల గురించి తెలంగాణ ప్రజలు అసలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు కండువాలు కప్పేటప్పుడు బిజెపికి ఫిరాయింపులు గుర్తు రాలేదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ పట్ల బిజెపికి సానుభూతి దేనికోసమే చెప్పాలని సిఎం రేవంత్ నిలదీశారు. బిజెపి, కెసిఆర్ ప్రేమించుకుంటే తమకు అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక, ఎమ్మెల్యేల చేరికల విషయంలో గతంతో పోలిస్తే తాము చాలా ప్రజాస్వామికంగానే ఉన్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

మీడియానే కేబినెట్‌ను విస్తరించింది…వాయిదా వేసింది….
కొత్త పిసిసిని నియమించాలని అధిష్టాన్ని కోరినట్లు సిఎం తెలిపారు. కేబినెట్ విస్తరణపై మీడియాలో వస్తున్న అవాస్తవాలు సిఎం ఖండించారు. మీడియానే కేబినెట్‌ను విస్తరించిందని, వాయిదా వేసిందని సిఎం అన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి పెట్టామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మూసీనదిపై వాహనాలు, రైళ్లు వెళ్లేలా….
తెలంగాణలో 2029వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎపిలో ఐదేళ్లకోసారి, తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందన్నారు. ఈవిఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సిఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజున రిజర్వులో ఉండే 15శాతం ఈవిఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందసిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాటిని అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశం ఉండదని సిఎం చెప్పుకొచ్చారు. మూసీనది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నట్లు చెప్పారు. 55 కిలోమీటర్ల మేర మూసీనదిపై వాహనాలు, రైళ్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో నిరాశ్రయులయ్యే 10వేల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలనలో ముఖ్యమంత్రిగా ముద్ర వేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలి: డిప్యూటీ సిఎం
యాక్షన్ లేకుండా సిగ్గరేణి బొగ్గుగనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని, డిఫెన్స్ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాలని కోరినట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్కమార్క తెలిపారు. ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని కోరామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని ప్రధానిని కోరామని భట్టి తెలిపారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని విన్నవించినట్లు భట్టి చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని,

తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు భట్టి వివరించారు. జిల్లా ఒక నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరామని భట్టి పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని మోడీని కోరామన్నారు. ఈ క్రమంలోనే విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ చొరవ తీసుకోవాలని కోరామని ఆయన తెలిపారు. తమ వినతులకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు సానుకూలంగా స్పందించారని ఉప ముఖ్యమంత్రి వారిద్దరికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News