Friday, December 27, 2024

మూసీ నది అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి: సీఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయండి
గ్యాస్ సబ్సిడీ ఓఎంసీలకు ముందుగానే చెల్లించే అవకాశం కల్పించండి
పౌరసరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి
కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్‌దీప్ సింగ్ పూరీ, ప్రహ్లాద్ జోషిలకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీరివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీనదిని దేశంలో మరెక్కడ లేని విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఢిల్లీలో రెండోరోజూ సిఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలోనే సిఎం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సి.ఆర్.పాటిల్, హర్‌దీప్ సింగ్ పూరీ, ప్రహ్లాద్ జోషిలను ముఖ్యమంత్రి సోమవారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి సిఎం రేవంత్ తీసుకెళ్లారు. నగరంలోని మురికినీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మూసీలో చేరే మురికి నీరును శుద్ధి చేయడం, వరద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద దక్కన్ పీఠభూమిలోని నదుల పరిరక్షణ, అభివృద్ధికి కేంద్రం యోచిస్తున్నందున మూసీలో కలిసే మురికినీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కోట్లు కేటాయించాలని సిఎం రేవంత్ కోరారు. గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీనది పునరుజ్జీవనానికి తోడ్పాటునందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

రూ.16,100 కోట్లు అవసరం: జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌కు విజ్ఞప్తి
జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2019 లెక్కల ప్రకారం జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతోందని, ఇటీవల తాము చేపట్టిన సర్వేలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని తేలిందని సిఎం కేంద్రమంత్రికి వివరించారు. ఆ ఇళ్లతో పాటు పిఎంఏవై (అర్బన్), (రూరల్) కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, ఇందుకు మొత్తంగా రూ.16,100 కోట్లు అవసరమవుతాయని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. 2019లో జల్‌జీవన్ మిషన్ ప్రారంభించినా నేటి వరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని, ఈ ఏడాది నుంచి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపి రామసహాయం రఘురామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.

రూ.500లకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై పెట్రోలియం మంత్రికి..
తెలంగాణలో రూ.500కే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి పూరీని పార్లమెంట్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. తాము ముందుగానే సబ్సిడీ చెల్లిస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలను గతంలోనే కోరినా సానుకూలత వ్యక్తం కాలేదన్నారు.

ప్రస్తుతం వినియోగదారులు సిలెండర్‌కు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండడంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. గ్యాస్ సిలిండర్లకు చెందిన సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే వినియోగదారులు రూ.500 చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ముందుగానే రాయితీని తాము ఓఎంసీలకు చెల్లిస్తున్నందున ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. అలా వీలుకాని పక్షంలో వినియోగదారులకు తమ ప్రభుత్వం చెల్లించే సబ్సిడీని 48 గంటల్లోపు అందేలా చూడాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
పౌరసరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి: కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నుంచి రావల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి సోమవారం కలిశారు. 2014,-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని గుర్తు చేశారు. అందువలన బకాయిపడిన ఆ మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రి పూరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News