సామాన్య రైతుకూ అర్థమయ్యేలా వెబ్‌సైట్
పకడ్బందీగా భద్రతాపరమైన చర్యలు ప్రతి
మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహనా
సదస్సులు ప్రజలకు, రైతులకు అవగాహన..
సందేహాల నివృత్తి పోర్టల్ బలోపేతానికి ప్రజల
నుంచే సలహాలు, సూచనలు.. వాటి ఆధారంగా
మార్పులు, చేర్పులు: ముఖ్యమంత్రి రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: భూ సమస్యల పరిష్కా రం, లావాదేవీలకు చెందిన సమాచారం సామాన్య రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండే లా భూ భారతి పోర్టల్ ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అత్యాధునికంగా భూ భారతి వెబ్‌సైట్ ఉండాలని, ఈ వెబ్‌సైట్ కనీసం 100 ఏళ్ల పాటు ఉం టుందని వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన సమస్య లు రాకుండా పకడ్బందీగా ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. భూ భారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయత కలిగిన సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. భూభారతి పోర్టల్‌ను సోమవారం మాదాపూర్‌లోని శిల్పకలావేదికగా ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భూ భారతికి సంబంధించి పలు అంశాలపై సిఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ భారతి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సిఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సిఎం ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే సలహాలు స్వీకరించాలి
భూ భారతి పోర్టల్ సామాన్య రైతులు, ప్రజలకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలోఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎం సలహాదారు వేo నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సిఎం ఒఎస్‌డి వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, సిసిఎల్‌ఎ కార్యదర్శి మకరంద్ పాల్గొన్నారు.