Sunday, February 23, 2025

కులగణనలో తప్పుంటే చూపించండి

- Advertisement -
- Advertisement -

విపక్షనేతలకు సిఎం
రేవంత్‌రెడ్డి సవాల్
తప్పుడు ప్రచారం చేయొద్దు
బట్ట కాల్చి మీదేయడం
సరైన పద్ధతి కాదు
కులగణనను నిర్వీర్యం
చేసేందుకు బిఆర్‌ఎస్,
బిజెపి కుట్రలు
కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌లు
జనాభా లెక్కల్లోనే లేరు
కష్టపడి కులగణన చేసినా
నన్ను విలన్ చేస్తున్నారు
కులగణనను విస్తృతంగా
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కులాల వారీగా సమావేశాలు
నిర్వహించాలి మార్చి
10లోగా తీర్మానాలు
చేయాలి కులగణనపై
అనుమానాల నివృత్తి
సమావేశంలో సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : కులగణన ప్రక్రియ ను నిర్వీర్యం చేసేలా బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కుట్ర పన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించా రు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ప్రక్రియను ప్రతిపక్షాలు తప్పుపట్టడం ద్వారా మొ త్తం ఈ వ్యవస్థను కుప్పకూల్చాలన్న కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. దేశంలో జనగణన చేయాల్సి వస్తే బిజెపిలో ఆధిపత్యం వహిస్తున్న ఒక టి, రెండు పెద్ద సామాజిక వర్గాలకు ఇది తీవ్ర వి ఘాతం కలుగుతుందని, కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేను బిజెపి తప్పుపట్టి ఈ లెక్కలే లేకుండా చేయాలని చూస్తోందని సిఎం ఆరోపించారు.

బిసి జనాభాపై అభ్యంతరాలపై బిజెపికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని అప్పుడు తాము చేసిన లెక్కలు తప్పొ ఒప్పో తెలుస్తుందని సిఎం రేవంత్ సవాల్ విసిరారు. శనివారం ‘బిసి కులగణనపై అనుమానాల నివృత్తి’పై హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బిసి సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్ సహా బిసి సంఘాల నేతలు హాజరయ్యారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు విమర్శిస్తారు….
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గుజరాత్‌లో 70 శాతం ముస్లిం జాతులను బిసిల్లో చేర్చారని, ఈ విషయాన్ని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని, 2022లో నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని, తాము ముస్లింలను బిసిల్లో చూపితే కేంద్రమంత్రి బండి సంజయ్ ఎలా విమర్శిస్తారని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా..? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన నివేదికను ఒక్కసారి కోర్టులో ప్రవేశపెడితే ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుందన్నారు. కేంద్రంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కులగణనకు ఎవరూ ప్రయత్నం చేయలేదని సిఎం తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాలతో 2011లో వివరాలు సేకరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన నివేదికను మోడీ సర్కార్ ఎందుకు బయటపెట్టలేదని సిఎం ప్రశ్నించారు. లెక్కలు తెలిస్తే వాటా అడుగుతారని బయటపెట్టలేదని ఆయన ఎద్దేవా చేశారు.

కెసిఆర్ చెప్పినవన్నీ కాకి లెక్కలే….
గతంలో కెసిఆర్ సమగ్ర కుటుంబ సర్వేచేపట్టి కాకి లెక్కలు చెప్పారని, ఆ సర్వేలో తప్పులున్నాయి కాబట్టే వివరాలు బయటపెట్టలేదని సిఎం రేవంత్ విమర్శించారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పకడ్బందీగా, పారద ర్శకంగా నిర్వహించామని ఆయన చెప్పారు. కులగణనకు ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామన్నారు. ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే నమోదు చేశామన్నారు. పారదర్శకంగా సర్వే చేస్తే తప్పని విమర్శలు చేస్తున్నారని, తమ లెక్కలు తప్పని చెప్పేవాళ్లు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ బిసిల సంఖ్యకు తక్కువ చూపిస్తే తాము పెంచి చూపించామన్నారు. ఓసిల సంఖ్యను కెసిఆర్ తన సకలజనుల సర్వేలో 21శాతంగా చూపించారని వాస్తవానికి తాము చేపట్టిన సమగ్ర సర్వేలో వారు 17 శాతమే ఉన్నట్లుగా తేలిందని సిఎం అన్నారు. కెసిఆర్ సర్వేలో మైనార్టీలు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. ఇంతకీ కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావులు ఎందుకు వివరాలు ఇవ్వలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులు జనాభా లెక్కల్లోనే లేరని ఆయన తెలిపారు. బిసిల లెక్క ఎంత, కెసిఆర్ సామాజిక వర్గం లెక్కలు ఎంతో తెలుస్తాయనే వారు సర్వేలో పాల్గొనడం లేదని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రభుత్వం చేసిన లెక్క తప్పు అనడం తప్ప కెసిఆర్, హరీశ్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరైనా ఒక్క సూచననైనా చేశారా? ఏ తప్పు లేదు కాబట్టే అబద్ధాలు చెబుతున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏదీ కూడా రాత్రికిరాత్రి జరిగిపోదు
రాహుల్ గాంధీ హామీ మేరకు సిఎంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, దేశంలో ఏ సిఎం చేయలేని సాహసానికి పూనుకున్నానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఏదీ కూడా రాత్రికిరాత్రి జరిగిపోదని, కులగణన ఎన్నో ఏళ్ల పోరాటమని ఆయన అన్నారు. ఎంతో మంది సిఎంలుగా పని చేసినా ఎవరికీ రానీ అవకాశం తనకు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.
దేశంలో బిసి రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదన్నారు. తాను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటం లేదని ఆయన తెలిపారు.

నాపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు….
కులగణన విషయంలో కొందరు అతి తెలివితో లేదా వారి గుర్తింపు కోసమో ఈ లెక్కలు తప్పు అనేలా మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిలకు న్యాయం చేయాలని కులగణన సర్వేను ఏదో రకంగా పట్టాలెక్కించేం దుకు తల బద్దలుకొట్టుకుంటుంటే మళ్లీ తనపైనే రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారని సిఎం మండిపడ్డారు. కులగణన సర్వే చేయని వ్యక్తి ఫాంహౌస్‌లో హాయిగా పడుకున్నారని, ప్రస్తుతం ఆయనే మంచోడు అయ్యారని, బిసిలంటే లెక్కనే చేయని తండ్రి, కొడుకు, అల్లుడు మంచోళ్లు అయ్యారని సిఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల సంఘాల మీటింగ్‌లు పెడితే మనోళ్లు వెళ్లి కూర్చుంటున్నారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంత కష్టపడి కులగణన సర్వేచేసినా రేవంత్‌రెడ్డిని విలన్‌ను చేస్తున్నారన్నారు.

నన్నే తప్పుబడితే ఎలా…?
కులగణన వద్దు అనేవాళ్లు ఎలాగు విలన్లేనని, మీకోసం ప్రయత్నిస్తున్న తనను కూడా తప్పు పడితే నష్టం మీకా నాకా? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మీరు అండగా నిలబడకపోతే ఎలా ఇది ముందుపడుతుందని సిఎం రేవంత్ నిలదీశారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ బిసి నేతలదేనని ఆయన స్పష్టం చేశారు. అంతా తానే చూసుకుంటానని అనుకోవడం సరికాదని, కులగణన లెక్కలు తప్పు అని విమర్శిస్తున్న వాళ్లకు ఎక్కడికక్కడ సమాధానం చెప్పాలని సిఎం రేవంత్ సూచించారు. బిసి లెక్కలకు చట్టబద్ధత కల్పించడంతో తన బాధ్యత అయిపోతుందని, అక్కడి నుంచి దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్తారో మీ ఇష్టమని సిఎం రేవంత్ అన్నారు. బిసి నేతలు కులాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలని యూనివర్సిటీల్లో మేధావులతో సెమినార్లు నిర్వహించాలని సిఎం సూచించారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయాలన్నారు. మీ ఐకమత్యాన్ని చాటాలని, అప్పుడే మీకు రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుందని, బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బిసిలదే
బిసిల లెక్క తేలితే నష్టపోయే రాజకీయ శక్తులే దీనిని వ్యతిరేకిస్తున్నాయని సిఎం రేవంత్ విమర్శించారు. తప్పుడు లెక్కలు అని ముద్రవేసి బిసిలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కులగణన బిసిలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అని, ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బిసిలదేనని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజకీయ ప్రేరేపితానికి లోనైతే బిసిలు శాశ్వతంగా నష్టపోతారని, బిసిలు దీనిని పట్టించుకోకపోతే ఈ లెక్కలు పట్టాలెక్కవని, కుట్రలను ఛేదించకపోతే బిసిలు శాశ్వతంగా నష్టపోతారని సిఎం రేవంత్ తెలిపారు. మంచి చేసిన నన్నే రాళ్లతో కొడదామనుకుంటే నష్టపోయేది బిసిలేనని ఆయన అన్నారు. కులగణనను వ్యతిరేకిస్తున్న వాడిని వదిలేసి బిసి లెక్కలు తేల్చిన తమపై ఆరోపణలు చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనని సిఎం రేవంత్ హితవు పలికారు. ఈ లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు. బిసిల కోసం తన శక్తి మేరకు సాహసం చేశానని, దీనిని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత బిసిలదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News