డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం రేవంత్‌రెడ్డి
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి తీవ్ర నష్టం
ప్రస్తుతం లోక్‌సభలో 24శాతం ఉన్న సీట్లు 19శాతానికి పడిపోయే ప్రమాదం
మన రాజకీయ ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేము పునర్విభజనకు
జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో
అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి కశ్మీర్‌లో సీట్లు పెంచిన కేంద్రం మనకు మొండిచెయ్యి
చూపిస్తున్నది జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ శాపంగా మారకూడదు
తీర్మానం ప్రవేశపెడుతూ సిఎం వ్యాఖ్యలు తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
మన తెలంగాణ/హైదరాబాద్ : డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని అసెంబ్లీ తీ వ్రంగా ఖండిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ సౌత్‌కు లిమిటేషన్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1971 నుంచి జనాభా నియంత్ర ణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయని, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్‌సభ సీట్ల సంఖ్యను యధాతథంగా కొనసాగించడంతో పాటు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని ప్ర స్తుత సరిహద్దులను మార్పు చేయాలని కోరుతూ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ గురువా రం ఆమోదించింది.
డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ప్రజలకు కలిగే నష్టాలను అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఇష్టానుసారంగా డీలిమిటేషన్ విధానంపై నిర్ణయం తీసుకుంటుందని, దీనిని దక్షిణాది రాష్ట్రాలు తొలినుంచి తీ వ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయని ఆయన అన్నారు. మొద ట ఈ అంశంపై తమిళనాడు సిఎం స్టాలిన్ పోరాటం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. డీలిమిటేషన్‌పై నష్టాన్ని ఇం దిరాగాంధీ 50 ఏళ్ల క్రితమే గుర్తించారని, దీంతో రాష్ట్రాలకు అంతరం రావొద్దన్న ఉద్ధేశ్యంతో మాజీ ప్రధాని ఇందిర రా జ్యాంగ సవరణ చేశారని, వాజ్‌పేయి కూడా పునర్విభజనను 25 ఏళ్లు వాయిదా వేశారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న ఆలోచన సరికాదని సిఎం సూచించారు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అంటున్నారని, అందులో భాగంగా కేంద్రానికి తెలంగాణ సభ నుంచి తీర్మానం చేసి పంపాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ తెలిపారు. డీలిమిటేషన్‌పై కేంద్ర మంత్రుల వాదనలు అర్ధరహితమని సిఎం అన్నారు. లోక్‌సభలో సౌత్ రాష్ట్రాల ప్రాతినిథ్యం 24 శాతంగా ఉందని, డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల ప్రాతినిథ్యం 19 శాతానికి చేరుతుందని ఆయన తెలిపారు. 24 శాతం ఎంపిలున్న సౌత్ కేంద్రానికి 36 శాతం పన్నులు కడుతుందని అయినా మనకు దక్కేది తక్కువ అని ఆయన వాపోయారు. కేంద్రానికి మనం ఒక్క రూపాయి చెల్లిస్తే మనకు 40 పైసలే చెల్లిస్తుందని, బీహార్ కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే 6 రూపాయలు ఇస్తోందని ఆయన అన్నారు. మనకు జరిగే అన్యాయంపై కేంద్రంతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ గా మారుతుందని, డీలిమిటేషన్‌తో సౌత్ రాష్ట్రాల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సౌత్‌కు జరిగే అన్యాయాన్ని గుర్తించడం లేదని ఆయన వాపోయారు.
తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా సీట్లను పెంచాలి
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కసరత్తు పారదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని ఈ తీర్మానంలో సిఎం కోరారు. కేంద్ర ప్రభుత్వానికి తమ అభిమతాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో శాసనసభ తీర్మానం ప్రతిపాదించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును కేంద్రం పారదర్శకంగా చేపట్టాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, పార్లమెంట్ సీట్ల సంఖ్యను కూడా యధాతథంగా కొనసాగించాలని ఆయన సూచించారు. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన సూచించారు.
119 నుంచి 153 అసెంబ్లీ నియోజకవర్గాలకు పెంచాలి
ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, తాజా జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014లో నిర్దేశించిన మేరకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయవద్దని ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. పునర్విభజన కోసం గతంలో అనుసరించిన విధానాలను సభలో ఆయన వివరించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేసిన తీరు, సిక్కింలో జరిగిన ప్రక్రియ గురించి సిఎం రేవంత్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదని, క్షేమకరం కాదని, అందుకే రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. పునర్విభజన శాపంగా మారకూడదని, జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశ్యంతో చేపట్టిన 42, 84, 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని ఆయన అన్నారు. జనాభా నియంత్రణ అమలు చేయటం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని ఆయన పేర్కొన్నారు. రాజ కీయాలకు అతీతంగా ఈ తీర్మానానికి ఆమోదం తెలపాలని, రాజకీయ ప్రయోజనాలు వదులుకోవడానికి సిద్దంగా లేమని ఆయన తెలిపారు. మనందరం కలిసికట్టుగా ఉన్నామన్న సంకేతాన్ని కేంద్రానికి పంపాలని, సీట్లు తగ్గితే సౌత్ మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుం దని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, ఎపి, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో అన్ని సంఘాలతో చర్చలు జరిపామని సిఎం తెలిపారు.