Wednesday, January 22, 2025

కెటిఆర్, సబితా,హరీశ్ ఫాంహౌస్‌లు కూల్చాలా? వద్దా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతల ఫాంహౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని, మాజీ మంత్రి కెటిఆర్ అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌లను కూల్చాలా వద్దా? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకులకు ఫాంహౌస్‌లు ఉన్నాయని, వాటిని కూలగొట్టాలా వద్దా?, ఫాంహౌస్‌లు కూలుతాయన్న ఉద్ధేశ్యంతోనే పేదలను బిఆర్‌ఎస్ నాయకులు అడ్డు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. సికింద్రాబాద్‌లోని సిఖ్ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ కార్యక్రమాన్ని సిఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లచెరువులో, మూసీనది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది బిఆర్‌ఎస్ నాయకులు కాదా..? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. 20 ఏళ్లు ప్రజల్లో తిరిగిన వాడినని, తనకు పేద ప్రజల కష్టాలు తెలియవా? మూసీని అడ్డుపెట్టుకొని ఎంతకాలం తప్పించుకుంటారని సిఎం రేవంత్ అన్నారు. మీ భరతం పడతామని సిఎం రేవంత్ బిఆర్‌ఎస్ నాయకులను హెచ్చరించారు. కిరాయి మనుషులతో కెటిఆర్, హరీష్ రావులు హడావిడి చేస్తున్నారని సిఎం విమర్శించారు. పదేళ్లు బిఆర్‌ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము వాళ్ల పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు మూలుగుతున్నాయని అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం
చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్న నగరాన్ని ఇంకెప్పుడు కాపాడుకోవాలని సిఎం ప్రశ్నించారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని అందరూ వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని సిఎం రేవంత్ సూచించారు. సమావేశం ఒక్కరోజు కాదని కెటిఆర్, హరీష్ రావులు సచివాలయానికి వస్తే నాలుగు రోజులు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని సిఎం రేవంత్ హితవు పలికారు. మూసీ పక్కనే ఆ మురికిలో పేదలు ఎందుకు బ్రతకాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీనదిని ప్రక్షాళన చేస్తే నగర ప్రజలకు రోగాలు తప్పుతాయని, అక్కడి ప్రజలు గౌరవంగా బ్రతుకుతారని సిఎం పేర్కొన్నారు. జవహర్ నగర్‌లో 1,000 ఎకరాలు ఉంది, రండి పేదలకు పంచి ప్రతి పేద కుటుంబానికి 150 గజాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటూ సిఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

మూసీనదిని బిట్లు బిట్లుగా అమ్మి…..
పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో మూసీనదిని బిట్లు బిట్లుగా లక్షలు, కోట్ల రూపాయలకు అమ్ముకున్నది మీ పార్టీ వాళ్లు కాదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హియాయత్ సాగర్ జంట జలాశయాలను సైతం కబ్జా చేసింది మీరు కాదా అంటూ బిఆర్‌ఎస్ నాయకులపై సిఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుల్డోజర్లు తమపై నుంచి వెళ్లాలంటూ బిఆర్‌ఎస్ నాయకులు పెద్ద పెద్ద డైలాగ్స్ వాడుతున్నారని సిఎం సెటైర్లు వేశారు. మీలాంటోళ్ల కోసం బుల్డోజర్లు అవసరం లేదని పిచ్చికుక్క కరిస్తే సచ్చేటోళ్ల కోసం బుల్డోజర్లు అవసరమా అంటూ ఆయన చురకలు అంటించారు. మీ కోసం ఒక్క బుల్డోజర్ కూడా కొనేది లేదని అన్ని బుల్డోజర్లు ప్రభుత్వం దగ్గర లేవంటూ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రధాని వద్దకు వెళ్దాం పదండి…నాకు భేషజాలు లేవు….
ఇక్కడి ఎంపి ఈటల రాజేందర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏం తీసుకువస్తారో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు, కానీ, మేము మూసీని అభివృద్ధి చేయొద్దా అని సిఎం ప్రశ్నించారు. గుజరాత్‌లో అనేక నదుల ప్రక్షాళనకు ముందుకు వస్తున్న బిజెపి ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు, ఇక్కడ మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. కెటిఆర్, హరీష్‌రావులు మాట్లాడినట్టుగానే ఈటల మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. పార్టీ మారినా ఈటలకు పాత వాసనలు పోలేదని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు ఇళ్లు ఇప్పించడానికి మోడీ దగ్గరకు వెళ్దాం రండి, నాకు ప్రధాని వద్దకు రావడానికి ఎలాంటి భేషజాలు లేవు, బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు కలిసి రావాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు తమ మంత్రివర్గం మొత్తం మీతో కలిసి ఢిల్లీకి వస్తుందని మూసీ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఇప్పించాలని సిఎం రేవంత్ వారికి సవాల్ చేశారు. నగరంలో చెరువులు, ఆక్రమణల లెక్క తీయాలని, వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

హైడ్రాపై చర్చ జరిగినప్పుడు ఎందుకు సూచనలు ఇవ్వలేదు
హైడ్రాపై అసెంబ్లీలోనే చర్చించామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు సూచనలు ఇవ్వలేదని విపక్షాలను సిఎం రేవంత్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయబోదని మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వబోతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, పిల్లలకు చదువుతో పాటు తరలింపునకు ఒక్కో ఇంటికి 25 వేల రూపాయల సాయం చేస్తున్నామని సిఎం వివరించారు. పేదలకు డబుల్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుందని సిఎం అన్నారు. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించారో కూడా చర్చించి తేల్చుకుందామన్నారు. ఈ మూసీ వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు విషం మింగుతున్నారని సిఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల దుఃఖం తమకు తెలుసని పేదవాడి కన్నీళ్లు చూడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు. బిజెపి, బిఆర్‌ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి నాటకాలు ఆడుతున్నాయన్నారు.

గత ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులు ఇవ్వలేదు
బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డుల కోసం కాళ్లు అరిగేలా వారి చుట్టూ తిరిగి అలసిపోయి వారిని ఇంటికి పంపించారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

వన్ స్టేట్ -వన్ కార్డు మరో కొత్త విప్లవానికి నాంది
వన్ స్టేట్ -వన్ కార్డు రాష్ట్రంలో మరో కొత్త విప్లవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలుకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఈ పైలట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పైలెట్ సర్వేను ఐదు రోజుల్లో పూర్తి చేసి ఈ విధానంలో మార్పులు, చేర్పులను పరిశీలించి, రాష్ట్రమంతటా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ చేస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అందులో భాగంగానే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఆ ఇంటి మహిళను ఇంటి యజమానురాలిగా ఉంచుతామన్నారు. రేషన్ కార్డులు వేరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వేరని ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలతో పాటు ఆ ఇంట్లో వారు పొందుతున్న పథకాల వివరాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న 30 శాఖల సమాచారాన్ని క్రోడీకరించి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రూపొందిస్తున్నామని సిఎం వెల్లడించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారం మార్చుకునే వెసులుబాటు ఉందని, అన్ని కార్డులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని సిఎం వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News