అత్యల్ప ద్రవ్యోల్బణ రాష్ట్రంగా
తెలంగాణ అవతరించిందన్న
సిఎం రేవంత్‌రెడ్డి ఇది ప్రజా
ప్రభుత్వ విజయమని ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: పాలన మారిన కొద్ది నెలల్లోనే సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. దేశం లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉ న్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం ప్రజా ప్రభుత్వ విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకా శాన్ని తాకిన సందర్భాలు తరుచూ చూశామని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ప్రజానీకాన్ని కేంద్రీకరించి అమలు చేస్తున్న విధానాలు తక్షణ ఉపశమనం కలిగించాయన్నారు. ఇది మార్పు..!! ఇది ప్రజల ప్రభుత్వం..!! అంటూ తన ప్రభుత్వ తీరును సిఎం రేవంత్‌రెడ్డి గర్వంగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని, ఇది సరళమైన హామీ కాదని -అమల్లోనే చూపిస్తున్నామని ఆయన తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్న పలు కీలక కార్యక్రమాలు ఇలా…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం సాధ్యమైంది.
కేవలం రూ.500లకు ఎల్‌పిజి సిలిండర్ : గ్యాస్ సిలిండర్ ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినూత్నంగా నిలిచింది.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ : ఇళ్లకు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇవ్వడం ద్వారా మధ్య తరగతి, పేద కుటుంబాలకు భారం తగ్గింది.
రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కవరేజీ : ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పరిష్కారంగా, సామాన్యులకు వైద్య ఖర్చులను భరించే అవకాశం దక్కింది.
రేషన్‌కార్డు దారులకు చక్కటి బియ్యం పంపిణీ : ఇప్పటికే ఉన్న రేషన్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, అధిక నాణ్యత కలిగిన బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పోషకాహార భద్రతను పెంచాం.