నిర్మాణం వరంగల్ నగరానికి
ప్రతిష్ఠాత్మకంగా ఉండాలి
సాధ్యమైనంత త్వరలో
భూసేకరణ ప్రక్రియ పూర్తి,
డిజైనింగ్‌కు చర్యలు
సమీక్షా సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సిఎంకు పలువురు
మంత్రులు, ఉమ్మడి వరంగల్
నేతల కృతజ్ఞతలు
వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలోనే నిర్మించాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా ఈ డిజైన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్‌గా ఉండాలని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని ఆయన చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసు కున్నారు. సాధ్యమైన తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్‌కు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెలా ప్రగతి నివేదిక అందించాలని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపిలు కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.