Wednesday, January 22, 2025

మూసీ పై ముందుకే..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ విషయంలో ఎవరూ అడ్డుపడ్డా ప్రక్షాళన చేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సిఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూసీని అభివృద్ధి చేయెుద్దని ప్రతిపక్షాలు అంటున్నాయని, ఎందుకు చేయెుద్దో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన 1,635 మంది అభ్యర్థులకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, మూసీ పరివాహక ప్రజలు ఆ మురికి ప్రాంతంలో పుట్టి అక్కడే ఉంటున్నారని, వారి భవిష్యత్తు తరాలూ అలాగే బతకాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాంత ప్రజలకు మంచి జీవితం ఉండొద్దా..?,

వాళ్ల పిల్లలు చదువుకోవద్దా..?, వాళ్లు బాగుపడొద్దా..? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లందరినీ బాగు చేసే మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో మెుత్తం 10 వేల కుటుంబాలు ఉన్నాయని, ఆరు నెలల నుంచి ఎన్యుమరేట్ చేయించినట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 33 బృందాలను పెట్టి ఇంటింటికీ తిప్పి ప్రతి ఒక్కరి వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవేర్‌నెస్ ప్రొగ్రామ్‌లో భాగంగా మార్కింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఎంత వరకూ బఫర్ జోన్ ఉందనేది వివరిస్తున్నామని, నష్టపోయే వారికి పరిహారం ఇవ్వనున్నట్లు నిర్వాసితులకు చెప్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీలో గుడిసెలు వేసుకున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తాం
నదుల పేర్లను ఎంతోమంది తమ పిల్లలకు పెట్టారని, చాలా మందికి గంగ, యమున, కావేరి పేర్లు ఉంటాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ పేరును ఏ తండ్రి అయినా తమ కుమార్తెకు పెట్టుకున్నారా..? అని అడిగారు. మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందని పేర్కొన్నారు. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా..? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా..? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని చెప్పారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరారు. హరీష్‌రావు, కెటిఆర్ మాట్లాడిందే ఈటల మాట్లాడుతున్నారని, ఈటెల రాజేందర్ ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలని పేర్కొన్నారు. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు… ధైర్యం ఉంటే కెసిఆర్, హరీష్, ఈటెల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండాలని, అప్పుడే వాళ్ల కష్టాలు, బాధలు తెలుస్తాయని అన్నారు.

వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి..ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉందని పేర్కొన్నారు. విశ్వాసంతో ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని అందరం నిలబెట్టుకుందామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్ల కెసిఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారని, మొన్నటి వరకు ఆయన పొందిన గౌరవం తెలంగాణ ఉద్యమం ఘనతే తప్ప ఆయన గొప్పతనం కాదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కెసిఆర్ కవచంగా మార్చుకున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పార్టీ నిధులు రూ.1500 కోట్లు దాటాయని, 2014కు ముందు బిఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నదెంత.. ఇప్పుడెంత..? అని అడిగారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి రూ.వందల కోట్లు ఎలా వచ్చాయని సిఎం ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కెసిఆర్ … 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు.. ఒక ఉద్వేగం
వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు భాగస్వాములు కాబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు, ఒక ఉద్వేగం అని సిఎం వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో… నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోవాలని అన్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది..ఇంజనీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమని పేర్కొన్నారు. 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ మీ చేతుల మీదుగా నిర్మాణం కాబోతున్నాయని ఇంజనీర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణం కాబోతున్నాయని, 55 కి.మీ మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు.

మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతో ఆనాడు తాను చేపట్టిన ‘విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్’కు నిరుద్యోగులు మద్దతిచ్చారని అన్నారు. కెసిఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు తాను చెప్పానని, తాను చెప్పినట్టే కెసిఆర్ ఉద్యోగం పోయింది.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశచెందారని, తమ మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు పరిష్కారం చూపించిందని తెలిపారు. 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు ఎల్.బి.స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News