రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదకుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. సోమవారం పౌరసరఫరాల శాఖపై సీఎం సౌరసరఫరాల శాఖ మంతి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల డిమాండ్, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన అంశాలపై సీఎం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. ప్రజా పాలనలో వచ్చిన అర్జీలు,
కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం జనం రద్దీ ఎందుకు ఉంటుందని సీఎం అధికారులను ప్రశ్నించారు. దానికి ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశమిచ్చినప్పటికీ, దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటవెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.