Sunday, January 19, 2025

8లోగా అందరికీ రైతుభరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఈనెల 8లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసాను అందిస్తామని ఒకవేళ ఇవ్వని పక్షంలో హైదరాబాద్‌లోని అమరవీరుల స్థ్ధూపం వ ద్ద తన ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరుతానని, రైతులందరికీ ఇస్తే కెసిఆర్ తన ముక్కును నేలకు రాస్తారా? అని సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా, కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల జనజాతర బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ .. కెసిఆర్ ఎక్కడికి పోయినా రై తు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని చెబుతూ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలోని  69 లక్షల మంది రైతుల్లో ఇప్పటివరకు 65 లక్షల మందికి రూ.7 వేల 500 కోట్ల నిధులను రైతు భరోసా కింద వారి అకౌంట్లలో జమ చేశామని, ఇంకా కేవలం నాలుగు లక్షల మందే ఉన్నారని, వీరందరికీ ఈనెల 8లోపు జమ చేయించే పూచీ తనదని స్పష్టం చేశారు. తమ ప్రభ్తుత్వం నెత్తిన 7 లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టి దివాళా తీసిన ఖాళీ ఖజానా అప్పగించినప్పటికీ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టోడు కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. రూ.27 వేల కోట్ల అప్పుల కిస్తీలు కడుతూ రాష్ట్ర సంసారాన్ని చక్కదిద్దుతున్నారన్నారు. నయవంచకుడు, నక్కజిత్తుల కెసిఆర్ మాటకు ముందు అబద్ధాలు ఆడు తూ కాలకూట విషం కక్కుతున్నారన్నారు. రైతులందరికీ భరోసా ఇచ్చినా, నెల నెల పింఛన్లు ఇస్తున్నా ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేసి ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని మొదటి నుంచి తమ పార్టీ చెప్పుతున్న విషయాన్ని సాక్షాత్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ అంగీకరించారని, ఇన్ని రోజులూ తాను చెప్పిందే నిజమైందని సిఎం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిన వాళ్ళను చెప్పుతో కొట్టాలని ఎంపిలు అరవింద్, బండి సంజయ్ పిలుపునిచ్చారని, మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుండు, కరీంనగర్‌కుచెందిన ఆర గుండులను చెప్పుతో కొట్టాల్నా? లేక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్‌ను కొటాల్నా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శనివారం ఒక పత్రికలో తాటికాయంత అక్షరాలతో ప్రకటించారని, తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని అన్నారు. ఎంతో కీలకమైన ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేస్తే రిజర్వేషన్ల రద్దు కత్తి మన మెడపై వేలాడుతుందని, దాని నుంచి రక్షణ పొందాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని అన్నారు.

మీరంతా కాంగ్రెస్‌కి ఓట్లు వేయాడనికి సిద్ధంగా ఉన్నారా? అని ఆయన సభకు వచ్చిన ప్రజానీకాన్ని ప్రశ్నించారు. పదేళ్ళపాటు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని బిజెపికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ కు గిరిజన విశ్వవిద్యాలయం, నల్లగొండ జిల్లాకు ఎఎంసి, మెదక్ జిల్లాకు ఎఐఎఎం, మహబూబ్‌నగర్ జిల్లాకు పాలమూర్ ఎత్తిపోతల పథకం వంటివి మంజూరు చేయకుండా నిర్లక్షం చేసి, తెలంగాణకు ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. బిజెపి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పట్టించుకోనప్పటికీ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ రోజు తల్లిని చంపి బిడ్డను బతికించారని అని అన్న బిజెపికి తెలంగాణలో ఓట్లు అడిగేహక్కు లేదన్నారు. బిజెపి తెలంగాణకు ఏమీ చేయకుండా గాడిద గుడ్డును మాత్రం మిగిల్చిందని చెబుతూ సభా వేదికపై గాడిద గుడ్డు ప్రతిమను ప్రదర్శింపజేసి మోడీ ఏం ఇచ్చిండు, బిజెపి ఏం తెచ్చింది.. గాడిద గుడ్డు అంటూ సిఎం సభికులతో పలుమార్లు అన్పించి కార్యకర్తలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అనిపిస్తోందని అన్నారు.

తెలంగాణలో బిఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఆపార్టీ అధినేత కెసి ఆర్ పార్లమెంట్ ఎన్నికలపై దింపుడు కళ్ళం ఆశపెట్టుకున్నారని, కానీ కారు ఖరాబ్ అయ్యి షెడ్డుకు వెళ్లిందని, దానిని ఇక పాత ఇనుపసామాగ్రివాడికి తుక్కుకింద కిలోల లెక్కనే అమ్ముకోవాల్సిందేనని, మళ్ళీ కారు బైటికి రాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బిఆర్ ఎస్, బిజెపి కలిసి గుడుపుఠాణీ నడిపిస్తూ ఈ రెండు పార్టీలు అంతర్గతంగా కుట్రలు చేస్తున్నాయని, వీరి కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మధ్య ఖమ్మం వచ్చిన కెసిఆర్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో నామా నాగేశ్వర్‌రావు కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారని, మరి ఆయన ఏ సంకీర్ణంలో చేరుతారో సెలవు ఇవ్వలేదన్నారు. బిఆర్‌ఎస్‌కు చెందిన కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలినా కాంగ్రెస్ కార్యకర్తలు కాల్చిపారేస్తారని, ఇక కెసిఆర్ చేరే సంకీర్ణం బిజెపిదేనని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2023 వరకు కెసిఆర్ మనస్సు బిజెపివైపే ఉందన్నారు.

నోట్ల రద్దు, జి ఎస్‌టి బిల్లు, రైతు నల్లచట్టాలు, కామన్ సివిల్ కోడ్ వంటి అనేక విషయాల్లో కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని, తెలంగాణలో కారు గుర్తుపై ఓట్లు వేయించుకోని ఢిల్లీలో కమలానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. నమ్మించి మోసం చేయడంలో కెసిఆర్‌ను మించినవారు లేరని, కెసిఆర్ మాటలకు ఖమ్మం బిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి నామా కూడా బకరా అవుతున్నారని, ఆయన చెవ్విలో పువ్వు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ బోర్లా పడి నడుం విరగ్గొట్టుకున్నారని, ఈ ఎన్నికల్లో మరో దెబ్బ వేయండి.. మళ్ళీ ఆ పార్టీ లేవదన్నారు. డిసెంబర్ 3న జరిగిన సెమీఫైనల్‌లో తెలంగాణలో కెసిఆర్‌ను ఓడించామని, మే 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టీమ్‌కు మోడీ నాయకత్వం వహిస్తుండగా తెలంగాణ టీమ్‌కు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని, ఫైనల్ మ్యాచ్ అయిన ఈ ఎన్నికల్లో గుజరాత్ టీమ్‌ను ఓడించి తెలంగాణ టీమ్‌ను గెలిపించి ఛాంపియన్‌గా నిలవాలంటే ఖమ్మంలో రఘురాంరెడ్డిని, మహబుబ్‌బాద్‌లో బలరాంనాయక్‌ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

భద్రాచలం రాములవారి సాక్షిగా చెబుతున్నానని, వచ్చే ఆగస్ట్ 15 నాటికి రాష్ట్రంలో రైతుల రెండు లక్షల రుణ మాఫీని అమలు చేసి తీరుతామని సిఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మొన్న సిద్దిపేటకు పోయి చెప్పాను పంద్రాగస్ట్ నాటికి సిద్దిపేటకు పట్టిన చీడపీడను వదిలిస్తానని, మరోసారి కొత్తగూడెం వేదిక సాక్షిగా సవాల్ విసురుతున్నానని, పంద్రాగస్ట్ నాటికి రుణ మాఫీ జరిగితే శనీశ్వర్ (హరీష్) రావు మాట మీద ఉండి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కానీ శనీశ్వర్ (హరీష్) రావు మాట మీద నిలబడకుండా పారిపోయే ఎత్త్తుగడలు వేస్తున్నారని విమర్శించారు.

దేశ రాజకీయాలకు ఖమ్మం దిక్సూచి
ఖమ్మం జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని పోరాటం చైతన్యం కలిగిన వాళ్లని, ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైంది కొత్తగూడెం జిల్లా నుంచేనని, ఈ జిల్లాను తాను మొదటి నుంచి నిశితంగా గమనిస్తున్నానని, ప్రతి ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఇక్కడ బిఆర్‌ఎస్‌కు ఒకే ఒక్క సీటు ఇచ్చారని, ఒక వ్యక్తి మంచోడో లేదా దుర్మార్గుడో ముందే పసిగట్టే దూరదృష్టి ఈ జిల్లా ప్రజలకు ఉందని అన్నారు. అందుకే కాలకుఠ విషం దాచుకున్న కెసిఆర్ కపట నాటకాలను ముందే పసిగట్టి ఓడించారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జిల్లా చైతన్యం, పట్టుదల తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శ, దేశ రాజకీయాలకు దిక్సూచి లాంటిదని, రాబోయే పరిణామాలను ముందే గుర్తించడంలో ఖమ్మం జిల్లా ప్రజలు దిట్ట అని, ఈ జిల్లా ప్రజలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు దేశంలోనే జవహర్‌లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీని నల్లగొండ జిల్లా ప్రజలు రావినారాయణ రెడ్డికి ఇచ్చారని,

ఈ ఎన్నికల్లో రఘురాంరెడ్డికి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేశంలోనే అత్యధికంగా 3 లక్షల మెజార్టీ ఇవ్వాలని సిఎం పిలుపునిచ్చారు.ఈ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకచౌదరి, ఖమ్మం ఎంపి అభ్యర్థి రామసహాయం రాఘురాంరెడ్డి, మహబుబాబాద్ ఎంపి అభ్యర్థి పోరిక బలరాంనాయక్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంఎల్‌ఎలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, డాక్టర్ రాగమయి, రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, డిసిసి అధ్యక్షుడు పోడెం వీరయ్య, పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, పార్టీ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుళ్ళూరి బ్రహ్మయ్య, ఎండి జావేద్, రాష్ట్ర, జిల్లానాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News