స్వప్రయోజనాల కోసమే పార్టీలు నిరసనలు, ధర్నాలకు
ప్రేరేపిస్తున్నాయి వాటి ఉచ్చులో పడితే మీకే నష్టం
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం
సమస్యల పరిష్కారానికి ధర్నాలు అవసరం లేదు
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అవసరాలకు
సరిపోవడం లేదు టిజిఒ డైరీ ఆవిష్కరణలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందని, సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ సూచించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని ఆయన అన్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరేనని ఆయన తెలిపారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తమకు ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొందని సిఎం తెలిపారు. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని, అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయన వాపోయారు.
ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కా వాలని, మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదని సిఎం రేవంత్ ఉద్యోగ సంఘం నాయకులతో పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదాయం రూ.18,500 కోట్లు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందన్నారు.
తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటితేదీన జీతాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు అని, ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదని సిఎం తెలిపారు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. వచ్చే ఆదాయంలో రూ. 6,500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు,
ఇతర అవసరాలకు చెల్లిస్తున్నామని, మరో రూ. 6,500 కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని, మిగిలిన రూ.5,500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కనీస అవసరాలకు ప్రతి నెల 22,500 కోట్లు కావాలని, వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోందని సిఎం అన్నారు. పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశామన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని సిఎం తెలిపారు. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని సిఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ ఆదాయం ప్రతి నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలన్నా, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నా, ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉందని సిఎం ఉద్యోగ సంఘం నాయకులతో పేర్కొన్నారు. మీ సమస్యలు చెప్పండి, పరిష్కారానికి కార్యాచరణ చేపడతామని సిఎం వారితో తెలిపారు. ముఖ్యమంత్రి ఎస్టీయూ, టీఆర్‌టిఎఫ్‌ల డైరీలను కూడా ఆవిష్కరించారు.