అసెంబ్లీలో కెసిఆర్ పాపాల చిట్టా
విప్పుతా నాపై పిల్ల కాకులను
ఉసిగొల్పుడు కాదు.. దమ్ముంటే
నువ్వు రా.. లక్ష కోట్లు
దోచుకున్నోడు జాతిపిత
ఎట్లయితడు? బిఆర్‌ఎస్ వల్లే
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
హరీశ్‌రావుకు ఆవగింజంత
తెలివి లేదు స్టేషన్‌ఘన్‌పూర్
సభలో మండిపడ్డ ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి రూ.800 కోట్ల
విలువైన అభివృద్ధి పనులకు
వర్చువల్‌గా శ్రీకారం ఎంఎల్‌ఎ
కడియం శ్రీహరి నిజాయితీ గల
నాయకుడని ప్రశంసల జల్లు
మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: లోక్‌సభ ఎ న్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగానే వరంగల్ జిల్లాకు ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చామని సిఎం రేవం త్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు రింగ్ రోడ్డుతో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రప్పించుకోగలిగామని తెలిపారు. జయశంకర్ సార్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసిన ఘన త తమ ప్రభుత్వానిదేనని అన్నారు. “ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కెసిఆర్ నాపైకి పిల్లకాకులను ఉసిగొల్పుతున్నారు.. దమ్ముంటే నువ్వేరా..” అంటూ రే వంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం, శివునిపల్లి లో జరిగిన ‘ప్రజాపాలన -ప్రగతి బాట’ వేదిక నుం చి కెసిఆర్ గత పాలనపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రూ.800 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. కెసిఆర్ కు టుంబ పాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో పడిందన్నారు. విద్యుత్ శాఖ, సింగరేణి సంస్థలకు బకాయిలు పెట్టారన్నారు.
గత సర్కార్ చేసిన అప్పులకు అసలు, మిత్తి రూ.1.53 లక్షల కోట్ల అ ప్పు బ్యాంకులకు చెల్లించామని అన్నారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని మాజీ సిఎం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారని అన్నారు. కెసిఆర్ పాపాల భైరవుడని, నోరు విప్పితే అబద్ధాలు చెప్పేటోడు, పీకలదాకా తాగేటోడు, లక్ష కోట్లు దోచుకున్నోడు జాతిపిత ఎలా అవుతాడని ఎద్దేవా చేశారు. భారత జాతిపిత గాంధీకి ఈయనకు పోలికేంటని ఎద్దేవా చేశారు. గాంధీజీ సాధారణ జీవితాన్ని గడిపారని, కెసిఆర్ మాత్రం వందల ఎకరాల ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని దుయ్యబట్టా రు. తెలంగాణకు జాతిపిత అయ్యే అర్హతలు కొం డాలక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావే శం ప్రారంభంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పింది ఇంటర్వెల్ మాత్రమేనని, బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కెసిఆర్ పాపాల చిట్టాను విప్పుతానని అన్నారు. సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తాడిచెట్టులా పెరిగాడు కానీ ఆయనకు ఆవగింజంత తెలివిలేదని వ్యాఖ్యానించారు.
కడియం శ్రీహరి తన కోరిక మేరకే కాంగ్రెస్‌లోకి చేరారని, ఆయనకు నియోజకవర్గ అభివృద్ధి తప్పా వేరే ఆలోచన లేదన్నారు. తన సొంత పనులకు పైరవీ చేయని నిజాయితీగల నాయకుడు కడియం శ్రీహరి అని అన్నా రు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించనున్నామని, రూ.46 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.148 కోట్లతో దేవాదుల కెనాల్ సిసి లైనింగ్ నిర్మాణం, రూ.38 కోట్లతో పంచాయతీరాజ్ బిటి రోడ్ల నిర్మాణం, రూ.5 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం, స్టేషన్‌ఘన్‌పూర్ గ్రామపంచాయతీని మునిసిపాలిటీగా అప్‌గ్రెడేషన్, రూ.24 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మారుమూల తండాలకు రోడ్లు, బంజారా భవన్ నిర్మాణం, రూ.102 కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా ఆర్‌టిసి బస్సులు, బ్యాంక్ లింకేజీ లోన్లు, రూ.12 కోట్లతో 5 సబ్‌స్టేషన్లు, డివిజనల్ ఆఫీస్ నిర్మాణం, రూ.250 కోట్లతో 5 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రూ.35 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం తదితర పనులను చేపడుతున్నట్లు తెలిపారు. తాను ఓట్లు అడగటానికి ఇక్కడికి రాలేదని, అభివృద్ధి కోసమే వచ్చానని తెలిపారు. కడియం శ్రీహరిని బలపరచాలని ప్రజలను సిఎం పిలుపునిచ్చారు.
కడియం పట్టువదలని విక్రమార్కుడు: -మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆయన పట్టువదలని విక్రమార్కుడని వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల్లో ముచ్చిందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని, కానీ కెసిఆర్ రెండుసార్లు అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడితే ముత్యాలు రాలుతాయన్నట్లు కనీసం నోరు తెరవకుండా వెళ్లిపోయారన్నారు. కెటిఆర్, హరీశ్‌రావు చెప్పే సొల్లు మాటలను ప్రజలు ఖాతరు చేయరన్నారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చినా బిఆర్‌ఎస్ నాయకులకు సిగ్గురాలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయన్నారు. పంటలు ఎండిపోవడం కాంగ్రెస్ తప్పుకాదని, గత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు.
కాంగ్రెస్ అంటేనే సంక్షేమం…-మంత్రి సీతక్క
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమని మంత్రి సీతక్క అన్నారు. ఇంటింటికీ ఒక్కో ఉద్యోగం అని రంగుల ప్రపంచం చూపించిన కెసిఆర్ నిరుద్యోగులను మోసం చేశారని, కానీ తమ ప్రజా ప్రభుత్వం 15 నెలల వ్యవధిలోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బిఆర్‌ఎస్‌ది అన్నారు. తాము ఉద్యోగాలిస్తుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఒక్క సంవత్సరంలోనే రూ.21,600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.
విద్య, వైద్యానికి పెద్దపీట…-మంత్రి కొండా సురేఖ
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. రాణి రుద్రమ, సమ్మక్క-సారక్క ఏలిన ప్రాంతమని, వరంగల్‌ను పర్యాటకపరంగా మరింత తీర్చిదిద్దాలని సిఎంను కోరారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పలేదని, ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు దృఢసంకల్పంతో ముందుకెళుతున్నారని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్షంగా కాంగ్రెస్‌లో చేరా…-ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి
ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రజల ఆదరాభిమానాలతో గెలిచిన తాను స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధే లక్షంగా కాంగ్రెస్‌లో చేరానని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క సంవత్సరంలోనే రూ.800 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఈ పనులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, సిఎం ప్రత్యేక నిధులతో మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలే తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. రేవంత్‌రెడ్డికి టెస్ట్‌మ్యాచ్, వన్డే మ్యాచ్ అయిపోయిందని, బిఆర్‌ఎస్ నేతలతో టి20 మ్యాచ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణను మోడల్‌గా తీర్చిదిద్దుతున్న సిఎం..-వరంగల్ ఎంపి కడియం కావ్య
వరంగల్ ఎంపికడియం కావ్య మాట్లాడుతూ.. క్రీమీలేయర్‌ను తిరస్కరిస్తూ తీర్మానాన్ని పంపిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది అన్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా తెలంగాణను మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ అంటే సిఎంకు ప్రత్యేక అభిమానం ఉందని, మామునూరు ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చారని, ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకున్నామని అన్నారు. 15 ఏళ్లలో స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేవలం 15 నెలల్లోనే స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధికి పనులు తీసుకొచ్చి కడియం శ్రీహరి తన మార్క్‌ను చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బలరాంనాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, యశస్వినిరెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, వేం నరేందర్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఝాన్సీరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్‌కుమార్, జిల్లా అధికారులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.