హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని సర్కారు అదేశించింది. ఈ మేరకు సోమవారం పౌరసరఫరాల శాఖ అధికారులుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లు పరిశీలించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా కార్డులను జారీ చేయాలని తెలిపారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కోడ్ అమలులో లేని జిల్లాల్లో కార్డుల పంపిణీ చేయాల్సిందిగా.. రేవంత్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల దరఖాస్తులు రాగా.. కార్డు ఉన్నవాళ్లు కూడా మళ్లీ కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా రేషన్ కార్డుల పంపిణి జరగాలని సిఎం ఆదేశించారు.