Friday, November 22, 2024

మూసీ ప్రక్షాళనకు అడ్డొస్తే బుల్డోజర్‌తో తొక్కేస్తా

- Advertisement -
- Advertisement -

‘యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహుని ఆశీస్సులు.. సం గెం శివన్న సాక్షిగా చెపుతున్న.. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదు.. ఇందుకు అడ్డొచ్చేవారిని బుల్డోజర్ ఎక్కి తొస్తేస్తా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనలో వెనుకడు గు వేస్తే.. తన పేరును మార్చుకుంటానని శపథం చేశారు. బిర్లా, రంగా, చార్లెస్ శోభరాజ్ అని పేర్లు చెబుతూ పరోక్షంగా హరీశ్‌రావు, కెటిఆర్, కెసిఆర్‌పై విమర్శలు చేశారు. వీరు ప్రజల వైపా? లేదం టే అడ్డుకుంటారా? ఆలోచించుకోవాలని సవాల్ వి సిరారు. మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి తన జన్మదినోత్సవం రోజు శుక్రవారం ‘మూసీ పునరుజ్జీవ పాదయాత్ర’కు నడుంబిగించారు. ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహునికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆ తర్వాత సంగెం శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. మూసీ పునరుజ్జీవ పాదయాత్రకు కదిలారు. అశేషజనం.. కార్యకర్తల కేరింతలు.. కదిలిన మంత్రులు, ఎంఎల్‌ఎలు.. అందరి ఉత్సాహం నడుమ పాదయాత్ర చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతం వెంట ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చే శారు. పరీవాహక ప్రాంతంలోని రైతులను స్వ యంగా కలిసి వారి బాధలు తెలుసుకున్నారు. మా ర్గమధ్యలో కులవృత్తులు, చేతివృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బోటులో మూసీ మధ్యలోకి వెళ్ళి పచ్చనినీటిని చేతపట్టుకొని సిఎం స్వయంగా పరిశీలించారు. ఓవైపు
రెండున్నర కిలోమీటర్లు.. మరోవైపు రెండుకిలోమీటర్లు నడిచి వెళుతూ అక్కడ ఇబ్బందులను తెలుసుకున్నారు. మూసీ బాధితులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈపాదయాత్రలో అనేక సమస్యలను సిఎం దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. రైతులు పండించిన పంటలు కొనేవారులేరు..

కూరగాయలకు గిరాకీలేదు.. చేపలు తినాలంటే భయపడుతున్నారు.. కనీసం కల్లు కూడా తాగడంలేదు.. పొట్ట్టేల్ మాంసం తినడానికి వెనుకంజ వేస్తున్నారు.. ఫ్లోరైడ్ ఓవైపు.. మరోవైపు మూసీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కులవృత్తులు, చేతివృత్తులు, రైతులు రేవంత్‌రెడ్డికి వివరించారు. మూసీ ప్రాంతం అంటేనే ప్రతిఒక్కరూ జంకుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. పాదయాత్ర చేసి వచ్చిన ముఖ్యమంత్రి సంగెం బొల్లేపల్లి రోడ్డులోని భీమలింగం వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మూసీ జీవనది.. పచ్చని పంటలతో కళకళలాడేదని, ఇప్పుడు కాలుష్యం వెదజల్లుతూ విషంగా మారిందన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది..
మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడు తాను చేపట్టిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవం డిపిఆర్ నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు. పూర్తిస్థాయిలో చేసిన తర్వాత మరోసారి పాదయాత్ర చేస్తానని చెప్పారు. మూసీ, ఈసా నదులు అనుసంధానం అయ్యే వాడపల్లి త్రివేణిసంగమం వద్ద పూజలు చేసి ప్రారంభిస్తామని తెలిపారు. వాడపల్లి నుంచి చార్మినార్‌కు లక్షమందితో జనవరి మొదటివారంలో పాదయాత్ర చేసి మూసీ మురికి పోగొడతానన్నారు. మూసీ శుద్ధీకరణ చేసేందుకు దేనికైనా వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. పునరుజ్జీవాన్ని అడ్డుకుంటామనేవాళ్ళు పేర్లు చెప్పి ముందుకు రావాలని సవాల్ విసిరారు. అసలు మూసీ ప్రక్షాళన అత్యవసరం కాదా? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, బిజెపి నేతలు జనంవైపా? అడ్డుకునేవైపా? తేల్చుకోవాలన్నారు. అడ్డుకుంటే నల్లగొండ జిల్లాప్రజలు నడుంకు తాడుకట్టి బిర్లా, రంగాలను మూసీలో ముంచేస్తారని హెచ్చరించారు.

నా జన్మధన్యమైంది..
‘చిన్నవయసులోనే నేను ముఖ్యమంత్రినైనా.. ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగింది.. మీరంతా (కార్యకర్తలు, జనం) నాకు అవకాశం కల్పించారు.. మూసీ విషంతో జనం బాధపడుతున్నారు.. మూసీ ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకు అనుకున్నా.. అందుకే మూసీ శుద్ధీకరణకు నడుం బిగించా’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఈరోజు నా జన్మదినోత్సవం కాదు.. మూసీ ప్రాంత ప్రజలతో ఉండటం.. ఓ అద్భుతానికి శ్రీకారం చుట్టడంతో నా జన్మ ధన్యమైంది’ అని రేవంత్ అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, నేనావత్ బాలునాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News