Wednesday, July 3, 2024

గాంధీల ఆత్మీయుడు డిఎస్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి డిఎస్ ఆత్మీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన చెప్పారు. 2004లో పిసిసి అధ్యక్షుడిగా సోనియా గాంధీకి తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని చెప్పారని, దీంతో కరీంనగర్‌లో సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించారని సిఎం తెలిపారు. ఆదివారం ఉదయం డిఎస్ భౌతికకాయానికి సిఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్‌లోని డిఎస్ నివాసానికి వెళ్లిన సిఎం రేవంత్, ఎంపి ధర్మపురి అరవింద్, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో సిఎం రేవంత్ మాట్లాడుతూ సోనియా గాంధీతో డిఎస్‌కు ఉన్న అనుబంధం కారణంగానే తెలంగాణ కల సాకారం అయిందన్నారు. 2004, 2009లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఎంతో కృషి చేశారని సిఎం రేవంత్ కొనియాడారు.

విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా…
విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో డిఎస్ పార్టీకి దూరమైనా పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో ఎదురు పడినప్పుడు సోనియాగాంధీ, ఆయన్ను ఆత్మీయంగా పలకరించేవారని సిఎం చెప్పారు. పార్టీలో లేకపోయినా డిఎస్ మనవాడు అని సోనియా గాంధీ అన్నారని, ఆ సమయంలోనే మళ్లీ పార్టీలో చేరుతానని ఆయన చెప్పారన్నారు. తాను చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలని మాత్రమే డిఎస్ కోరుకున్నారని అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు సిఎం తెలిపారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులు ఆయన ఇంటికి వెళ్లి పార్థివదేహంపై కాంగ్రెస్ జెండా కప్పారని ఆయన చివరి కోరిక నెరవేర్చామని రేవంత్ అన్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తుంచుకొని డిఎస్‌కు నివాళులు అర్పించానని సిఎం చెప్పారు.

ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం తరఫున కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డిఎస్ కారణంగా అనేక మంది నాయకులు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఆయన గౌరవం పెరిగే విధంగా ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు డిఎస్‌కు నివాళులు అర్పించాలని తనకు ప్రత్యేకంగా చెప్పారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిఎస్ ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర కంఠేశ్వర్, బైపాస్ రోడ్డు మీదుగా సాగింది. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు డిఎస్ అంత్యక్రియలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News