కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ పలు అంశాలపై సమావేశం
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టు భర్తీ, పిసిసి చీఫ్‌ల భర్తీపై
అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం
నేడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కాబోతున్నట్లుగా తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పిసిసి అధ్యక్షుడు ఎంపిక వంటి అంశాలపై పార్టీ పెద్దలతో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నట్లుగా సమాచారం.
లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టు భర్తీ, పిసిసి చీఫ్ మార్పులు ఉంటాయని కొంత కాలంగా టికాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశాల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఆసక్తిగా మారింది. ఇక నేడు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, సిఎం రేవంత్ పిసిసి చీఫ్ హోదాలో ఈ భేటీకి వెళ్తుండగా, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, శాశ్వత ఆహ్వానితుడు దామోదర్ రాజనర్సింహాలు సైతం హాజరవుతున్నారు.
ఈనెల 27వ తేదీతో రేవంత్ పిసిసి పగ్గాలు చేపట్టి మూడేళ్లు….
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మెరుగుపడిన నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పిసిసి పోస్టులో రేవంత్ రెడ్డినే కొనసాగిస్తారా ముఖ్యమంత్రిగా పరిపాలన భారం రేవంత్‌పై పెట్టి పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఒక వేళ వేరే వారిని పిసిసిగా నియమిస్తే ఈ పోస్టుకు రేవంత్ రెడ్డి ఎవరి పేరును సూచిస్తారనేది ఆసక్తిగా మారింది. పిసిసి చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. ఈనెల 27వ తేదీతో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈనెలాఖరులోగా కొత్త పిసిసి ఎంపిక ఉంటందని పార్టీలో టాక్ నడుస్తోంది.
ఇప్పటికే కొత్త పిసిసి కోసం కసరత్తు చేస్తోంది. సీనియార్టీతో పాటు పార్టీకి విధేయంగా ఉన్న వారికే పార్టీ పగ్గాలు ఉంటాయని తెలుస్తోంది. నేడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పార్లమెంట్ ఫలితాలపై, ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలపై చర్చ జరుగనుంది. అదే విధంగా పలు రాష్ట్రాల పిసిసి చీఫ్ ల మార్పుపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.