Wednesday, November 6, 2024

బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం:సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నేడు బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని బాబు సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న బాబూజీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సేవలందించారని, స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.

కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందించారని ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారని, రైల్వే, జాతీయ రవాణా శాఖ మంత్రిగా బాబూజీ తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్లాఘించారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాబూజీ స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News