సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లడం వల్లే తొక్కిసలాట వాహనం పైకెక్కి అభివాదం చేయడం
వల్లనే తోపులాట ఈ ఘటనలో జరిగిన మహిళ మరణానికి ఎవరు బాధ్యులు? అల్లు అర్జున్ మామ
చిరంజీవి కాంగ్రెస్ నేత ఆయనకు పిల్లనిచ్చిన చంద్రశేఖర్ రెడ్డి నాకు బంధువు చట్టం తన పని
తను చేసుకుపోతుంది సినిమా కోసం పైసలు పెట్టారు.. సంపాదించారు వాళ్లు దేశం కోసం
ఏమైనా చేశారా? ఓ ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఎలాంటి కక్ష సాధింపు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు, అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్‌రెడ్డి తమ బంధువు మాత్రమే కాకుండా ఆయన తమ పార్టీ నాయకుడని సీఎం గుర్తు చేశారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బంధువు అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదని సీఎం సమర్ధించుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని అల్లు అర్జున్ అరెస్టు పై శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం స్పందించిన విషయం తెలిసిందే. సాయంత్రం అక్కడే జరిగిన ఆజ్ తక్ ఛానల్ కార్యక్రమంలో కూడా ఆయన మరోసారి స్పందించారు. పుష్ప సినిమా ప్రీవ్యూ నిర్వహించిన థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగిందని, అతని వల్ల ఒక మహిళ చనిపోయిందని, ఆమె 9 ఏండ్ల కుమారుడు 14 రోజుల నుంచి ఆస్పత్రిలో కోమా లో చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లి ఉంటే అల్లు అర్జున్‌ది తప్పేమి ఉండేది కాదని,అలా కాకుండా థియేటర్ బయట తన వాహనం పైకి ఎక్కి జనానికి అభివాదం చేయడం వల్లనే అక్కడ తోపులాటకు దారితీసిందని సీఎం పేర్కొన్నారు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకుని చూడొచ్చు. ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. అలా కాకుండా ప్రేక్షకులు, అభిమానులతో కలిసి చూడాలనుకుంటే, ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే, మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇస్తే, వాళ్లు ఏర్పాట్లు చూసుకుంటారు. అలా కాకుండా సడెన్‌గా వచ్చేస్తే, ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్లు ఎలా సిద్ధం కాగలరని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై ఒకవేళ తాము కేసు పెట్టకపోయి ఉంటే, సినిమా యాక్టర్‌కు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయమా? అని అడుగరా? సీఎం ప్రశ్నించారు. సినీ నటులను అరెస్టు చేయడం ఈ దేశంలో ఇదే తొలిసారి కాదని, గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అరెస్టు కాలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ తల్లి సగటు తల్లి రూపం
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వివాదంపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం సగటు సామాన్యుడి తల్లి రూపంలో ఉందన్నారు. గతంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాజులు, రాణుల పోలీకలతో ఉందన్నారు. తాము అలా కాకుండా సగటు వ్యక్తి తల్లి రూపంలో ఉందన్నారు. తాను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, మా తల్లిని చూస్తే ఎలా ఉంటుందో ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే అలాగే ఉందని సీఎం అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో చేయి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుగా ఉందన్న విమర్శపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, భారత మాత, గౌతమ బుధ్దుడు, శిరిడి సాయిబాబా ఫోటోలలో కూడా చేయి ఉంటుందని గుర్తు చేశారు. తమ తెలంగాణ తల్లి విగ్రహంలో చూపించే హస్తాన్ని తల్లి ఆశీర్వాదంగా భావించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఇప్పుడు నేనే స్టార్‌ను !
‘ఇప్పుడు నేనే స్టార్‌ను& నాకూ ఫాన్స్ ఉంటారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హోం శాఖ నా వద్ద ఉంది, ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు తెలుసన్నారు. ఈ ఘటనలో చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడన్నారు. సినిమా కోసం పైసలు పెట్టారు& పైసలు సంపాదించారని అన్నారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదని అన్నారు. వాళ్లేమైనా సరిహదుల్లో దేశం కోసం యుద్ధాలు చేశారా అని అన్నారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నా అభిమాన హీరో కృష్ణ.. ఆయన ఇప్పుడు లేరన్నారు.