Monday, January 27, 2025

సంక్షేమ సంబురం

- Advertisement -
- Advertisement -

రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,
రేషన్‌కార్డుల పంపిణీ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
హైదరాబాద్ మినహా మండలానికో గ్రామం ఎంపిక చేయాలి
ఒక్కొక్క పథకానికి ఒక్కో అధికారి చొప్పున నాలుగు పథకాలకు
నలుగురు అధికారులను ఇన్‌ఛార్జీలుగా నియమించాలి
అనర్హులకు లబ్ధి చేకూర్చితే అధికారులపై చర్యలు తప్పవు
సమీక్షాసమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో ఒక్కో గ్రామాన్ని నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి ఎంపిక చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. నాలుగు పథకాలకు ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండల స్థాయి అధికారులను నియమించాలని సిఎం ఆదేశించారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31వ తేదీలోగా ఈ పథకాలు సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలని సిఎం రేవంత్ సూచించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు ఏమాత్రం అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూర్చితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గ్రామసభల్లో జరుగుతున్న రసాభాసపై రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో ఈ దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సిఎం రేవంత్ మంత్రులు, అధికారులతో చర్చించారు. ముఖ్యంగా గ్రామసభల్లో గందరగోళం జరగకుండా చర్యలు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించారు. అర్హులకు ఒకటి, రెండురోజులు ఆలస్యమైనా రేషన్‌కార్డులు వస్తాయి, అధికారులు సమయస్ఫూర్తితో ప్రజలకు సమాధానం చెప్పాలని సిఎం పేర్కొన్నారు. చివరి లబ్ధిదారుడి పేరు జాబితాలో చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని సిఎం తెలిపారు.

నేడు నారాయణపేట జిల్లాలో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన
నేడు నారాయణపేట జిల్లాలో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటిస్తారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News