హైదరాబాద్: సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… వైద్య కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్‌ను సందర్శించి నివేదిక ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రిపై రేపు హైకోర్టులో విచారణ ఉందని అధికారులు సిఎంకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుందామని సిఎం తెలిపారు. బోధనాసుత్రుల్లో హౌజ్ కీపింగ్ ను ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని సిఎం సూచించారు.