స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్షంగా పని చేయాలి కొత్త, పాత నేతలు
సమన్వయంతో ముందుకు సాగాలి 42శాతం స్థానాలు బిసిలకే కేటాయించేలా
చూడాలి అత్యధిక గ్రామాలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎంఎల్‌ఎలదే నియోజకవర్గానికో
ఎన్నికల ప్రణాళిక సంక్షేమ పథకాలు పేదలకు వివరించాలి ప్రతిపక్షాల
అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టడానికి రెండు భారీ బహిరంగసభలు బిసి
కులగణనపై సూర్యాపేటలో, ఎస్‌సి వర్గీకరణపై గజ్వేల్‌లో సభలు రెండు
సభలకు ఎఐసిసి అగ్రనేతల రాక సిఎల్‌పి సమావేశంలో సిఎం దిశానిర్దేశం
10 మంది ఫిరాయింపు ఎంఎల్‌ఎలు భేటీకి దూరం తీన్మార్ మల్లన్న డుమ్మా
ఢిల్లీకి సిఎం రేవంత్, వెంట డిప్యూటీ సిఎం భట్టి, పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్
కెసి వేణుగోపాల్‌తో చర్చలు నేడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌తో భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ :స్థానిక సంస్థల ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు సమన్వయం తో సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో కొత్త ,పాత నేతలు సమన్వయంతో ముం దుకు సాగితేనే స్థానిక సంస్థల్లో పాగా వేయగలమని వారు సూచించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సీఎల్పీ సమావేశం సుమారుగా ఐదున్నర గంటలపాటు సాగింది. ఈ సందర్భం గా సిఎం రేవంత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్ధేశించి మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవుల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా, బిసి వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఆదేశించారు. బిసి నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడానికి, వారికి అధికారంలో మద్దతుగా నిలిచేందుకు కాం గ్రెస్ కట్టుబడి ఉందని
సిఎం పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నేతలు, క్యాడర్ అందరూ ఒకే తాటిపై నిలిచి పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మరింత దృఢంగా నిలుస్తుందని, అందుకే ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా ఎన్నికల ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటూ ప్రభుత్వ పథకాలను గట్టిగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ విజయానికి శ్రమించాలని, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
సూర్యాపేట, మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలు
కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా బిసి కులగణన చేపట్టామని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతా చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేద్దామని సిఎం రేవంత్ సూచించారు. బిసి కులగణను శాస్త్రీయంగా చేపట్టామని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థాయిలోనే కౌంటర్ అటాక్ వేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అదే విధంగా ఎస్సీ వర్గకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, అందులో భాగంగా దానిని అమలు చేసి చూపామని ముఖ్యమంత్రి అన్నారు.
ఎస్సీ వర్గీకరణ, కులగణన నేపథ్యంలో మెదక్ పరిధిలోని గజ్వేల్, సూర్యాపేటలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు సిఎం తెలిపారు. బిసి కులగణన విజయవంతంపై సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యఅతిథిగా పిలిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై మెదక్ పరిధిలోని గజ్వేలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా పిలవనున్నట్టు సిఎం తెలిపారు. బిసి కులగణన, ఎస్సీ వర్గీకరణలు రెండు చారిత్రాత్మక నిర్ణయాలని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం వారిని ఆదేశించారు.
ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సిఎం స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సిఎం సూచించారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలని, సిసిరోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు, నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలుంటే తన వద్దకు వచ్చి నేరుగా చెప్పుకోవాలని సిఎం చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై ప్రతిపక్షాలు లేని పోని అపోహలు సృష్టిస్తున్నాయని, అదే స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
సీఎల్పీ సమావేశానికి ఆ 10 మంది దూరం
ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి రావాలని పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం వెళ్లింది. అయితే అనూహ్యాంగా వారు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, సంజయ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరుకాలేదు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉండటం, టెక్నికల్ గా ఏ సమస్యా రాకుండా ముందు జాగ్రత్త చర్యగా వారు గైర్హాజరైనట్టుగా తెలిసింది.
తీన్మార్ మల్లన్న డుమ్మా..
ఈ సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం గైర్హాజయ్యారు. ఈ సమావేశానికి 56 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఒకవేళ ఆయనకు నోటీసులు అందకపోతే మళ్లీ ఇస్తామని ఆమె తెలిపారు.
ఢిల్లీకి సిఎం రేవంత్
ఏఐసిసి అగ్రనేతలను కలవడానికి సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఢిల్లీకి గురువారం రాత్రి వెళ్లారు. నేడు ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో నిర్వహించిన బిసి కులగణన తీర్మానం, ఎస్సీ వర్గీకరణ వివరాలను వివరించడంతో పాటు రెండు జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలకు ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించడానికి ఢిల్లీకి సిఎం రేవంత్, డిప్యూటీ సిఎంలు వెళ్లారు.
కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ
ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీతో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ, పిసిసి కూర్పు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కులగణన గురించి కెసి వేణుగోపాల్‌తో వారు చర్చించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపిలు పాల్గొన్నారు. నేడు ఏఐసిసి అగ్రనేతల రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.