Sunday, December 22, 2024

ఆర్‌ఆర్‌ఆర్ భూ సేకరణలో వేగం పెంచండి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం భూ సేకరణలో వేగం పెంచండి
రెండు పార్టుల్లో ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయాలి
భవిష్యత్ అవసరాలకు తగినట్లు దక్షిణ భాగం
భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి
ప్రతిపాదిత అలైన్మెంట్‌లో మార్పులకు సిఎం సూచన
ఆర్‌ఆర్‌ఆర్ మ్యాప్‌ను గూగుల్ మ్యాప్‌లో పరిశీలించిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారు… పనుల పురోగతి ఏమిటనే దానిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూ సేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారం తనకు అందజేయాలని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణ, పనులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. భూ సేకరణ వేగం పెరగాలని, ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలోని కలెక్టర్లు ఈ రహదారి విషయంలో రోజువారీగా ఏం చేశారు… ఏం పురోగతి సాధించారు.

దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతి రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. భూ సేకరణలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. సిఎస్‌తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఒఎస్‌డి షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్‌డేట్ చేయాలని సూచించారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా అలైన్‌మెంట్ ఉండాలి
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి- ఆమన్‌గల్- షాద్ నగర్ -చౌటుప్పల్ (189.20 కి.మీ.) మార్గానికి సంబంధించి భూ సేకరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్తరభాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయినందున, దక్షిణ భాగంలోనూ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని, అదే సమయంలో పనుల విషయంలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం మ్యాప్‌ను గూగుల్ మ్యాప్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పుచేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా అలైన్‌మెంట్ ఉండాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అన్నారు. తాను సూచించిన మార్పులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణంపైన అధికారులకు సిఎం సూచనలు
ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణానికి ముందే ఎక్కడెక్కడ అవి ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలి… సిగ్నల్, ఇతర సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రేడియల్ రోడ్లు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల అనుసంధానానికి అనువుగా ఉండాలని, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు.

సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, సిఎం ఒఎస్‌డి షానవాజ్ ఖాసీం, ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News