తెలంగాణ రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు రేపటినుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సంక్షేమ పథకాల అమలుపై మంత్రులు, అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు నియామకం చేపట్టాలని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని.. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులను మెచ్చరించారు.