బీజేపీ నేతలతో
ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి
చీకటి ఒప్పందాలు:
కెటిఆర్ ఫైర్
పరిపాలన చేతకాక శాసనసభలో బీఆర్‌ఎస్ గొంతునొక్కాలని చూస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల పక్షాన తప్పకుండా మూడుచెరువుల నీళ్లు తాగిస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలతో ఆగంచేసి, 420 హామీలతో మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కారు పాపం పండిందన్నారు. బీఆర్‌ఎస్ నేడు పూరించిన జంగ్ సైరన్ ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ మోసకారి ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమపంథాను కొనసాగిద్దామన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బిఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ఇలాగే సంఘటితశక్తిగా ముందుకు సాగుదామని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య చీకటి ఒప్పందం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశం అయ్యారని మండిపడిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ఆరోపించారు. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయట పెట్టాలన్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం అన్నారు.
కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిలదీశారు. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదని, రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడతారని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.