Sunday, November 24, 2024

రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రక్షించే బాహుబలి రాహుల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నర్సాపూర్/ఎల్‌బినగర్: దేశంపై, సమాజం పై, రాజ్యాంగంపై, రిజర్వేషన్‌లపై దాడి చేయాలని మోడీ, అమిత్ షాలు బ యలుదేరారని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్‌లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్‌గాంధీ ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్, సరూర్‌నగర్‌లో గురువారం జరిగిన జనజాతర సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు రాహుల్‌కు అండగా నిలిచి రిజర్వేషన్లను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 15 సెకన్ల సమయమిస్తే, మైనార్టీలను లేకుండా చేస్తామని రాష్ట్రానికి వచ్చిన ఓ బిజెపి ఎంపి మాట్లాడారని అతనిపై ప్రధాని చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.

మత కలహాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో మత చిచ్చుపెట్టాలని చూస్తున్న కమలానికి, ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు. బిజెపి పెడుతున్న మతచిచ్చు ఉచ్చులో మనం పడొద్దని ఆయన వ్యాఖ్యానించారు.బిజెపి ఉచ్చులో పడొద్దు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, బిజెపి ఉచ్చులో పడొద్దని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపి నేతలపై ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. కాషాయ పార్టీ తెలంగాణకు ఇచ్చింది, మోడీ తెచ్చింది ఏమీ లేదని, గాడిద గుడ్డు తప్ప అని సిఎం రేవంత్ ఆరోపించారు.

ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య
పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ జీవితాన్ని అంకితం చేశారని, మన రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిపించి ఇండియా కూటమిని గెలిపించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య అని, ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లపై మోడీ కళ్లు పడ్డాయన్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానానికి గొప్ప పేరు
దేశ చరిత్రలో మెదక్ పార్లమెంట్ స్థానానికి గొప్ప పేరుందని, 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ బరిలోకి దిగి అధిక మెజార్టీతో గెలిచి ప్రధాని అయ్యారని సిఎం రేవంత్ అన్నారు. ఇందిరాగాంధీ ఎంపిగా ప్రాతినిథ్యం వహించడం వల్లనే మెదక్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు. మెదక్ పార్లమెంట్ లో వేలాది పరిశ్రమలు రావడానికి కారణం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కారణమన్నారు. మెదక్ ఎంపిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ మరణించారని, గత పదేళ్లుగా బిఆర్‌ఎస్, బిజెపి చేతిలో ఈ ప్రాంతం మగ్గిపోయిందని సిఎం రేవంత్ ఆరోపించారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ లో వేలాది మంది రైతుల భూములను ముంచింది బిఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని సిఎం రేవంత్ ఆరోపించారు. మన భూములు గుంజుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంతం పై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు వెంకటరామిరెడ్డి తప్ప ఇంకో వ్యక్తి దొరకలేదా అంటూ బిఆర్‌ఎస్ నాయకులను సిఎం రేవంత్ ప్రశ్నించారు.

విశ్వనగరంలో బిజెపి వాళ్లు విషం చిమ్ముతున్నారు ?
విశ్వ నగరంలో బిజెపి వాళ్లు విషం చిమ్ముతున్నారని, మనం అన్ని పండుగలు చేస్తున్నాం. హిందూత్వం గురించి బిజెపి వాళ్లు నేర్పాలా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ పండుగలు బిజెపికి గుర్తుకు వస్తున్నాయన్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. భిక్షగాళ్ల లాగా రాముడి, హనుమాన్‌ను బిజెపి వాళ్లు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ బస్సు యాత్ర చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే ఉందని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఎంపి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News