డ్రోన్ ఎగరవేస్తే డిటెన్షన్ సెల్‌లో పెట్టారు
నక్సల్స్, ఐఎస్‌ఐ ఉగ్రవాదులు ఉండే సెల్‌లో
వేశారు నా బిడ్డ లగ్గం ఉంటే.. లగ్న పత్రిక
కూడా రాసుకోనియ్యలేదు 16రోజులు
నిద్ర పోలేదు ఫామ్‌హౌస్‌ల కోసమే
ప్రాజెక్టులు కట్టారు నిజ నిర్ధారణ కమిటీ
వేద్దామా? బిఆర్‌ఎస్‌కు సిఎం సవాల్
గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని, మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు, మీ కుటుంబమంతా చర్లపల్లి, చెంచల్‌గూడ జైల్లో ఉండేవారు కానీ, ఆ పని నేను చేయలేదు, ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు అని అన్నారు. గురువారం శాసనసభలో బిఆర్‌ఎస్ సభ్యుడు కె.టి.రామారావు కు సిఎం కౌంటర్ ఇస్తూ సలహాలు, సూచనలు ఎదుటివారికి ఇవ్వడానికే కానీ పాటించడానికి కాదు అన్నట్లుగా కెటిఆర్ వైఖరి ఉందన్నారు.
డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్
ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్ వేస్తారు.. కానీ ఆనాడు వాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న తనను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు ఉండే కాంపౌండ్‌లో 16 రోజుల పాటు డిటెన్షన్ సెల్‌లో పెట్టినా ఆకోపాన్ని దిగమింగుకుని పనిచేస్తున్నానని తెలిపారు. కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు, ఒక చిన్న సెల్, పడుకునేందుకు అందులో గద్దె మాత్రమే ఉంది, అందులో రాత్రిపూట ట్యూబ్ లైట్ వెలుతురు దగ్గరకు లైటుపురుగుల కోసం పదికి మించి పెద్దపెద్ద బల్లులు వచ్చేవి ఆ పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. ట్యూబ్‌లైట్ స్విచ్ బయట ఉండేది, ఆ పదహారు రోజులు పగటిపూట చెట్టుకింద పడుకున్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రిగా హోం మంత్రిత్వశాఖ తన వద్దే ఉంది, మంత్రులు, ఎమ్మెల్యేలను ఆ జైలును చూపిస్తాను అని తెలిపారు. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు అని సిఎం వ్యాఖ్యానించారు.
లగ్నపత్రికకు అడ్డుపడ్డారు
నా బిడ్డ పెళ్లికి ముందు లగ్నపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, నా బిడ్డ పెండ్లికి మధ్యంతర బెయిల్‌పై వెళ్లి వచ్చానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా ! అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు, సొంతపార్టీ ఆఫీసులో కూలిపైసలు ఇచ్చి కిరాయి మనుషులతో నా మీద బూతులు మాట్లాడించి రికార్డు చేయించి ప్రసారం చేయించారు, చెంపలు పగులగొట్టే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాను, ముఖ్యమంత్రిగా నాకు విశేష అధికారాలు ఉన్నాయి. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోందని అన్నారు. కేటీఆర్, కేసీఆర్‌కు జైలులో డబుల్‌బెడ్‌రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రజలకుల హామీ కూడా ఇచ్చానని, దానికి ఇప్పటి వరకు నెరవేర్చలేదు, ఆహామీని కూడా అమలుచేసేందుకు సమయం వస్తుందని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్‌ను జైలులో వేయాలని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారని అన్నారని తెలిపారు.