కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు. వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందని.. వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు.
కేంద్రం కుట్రలను అడ్డుకోవాలని.. ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతామన్నారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివేనని దుయ్యబట్టారు. యూజీసీ నిబంధనలు కేంద్రం ఉపసంహరించుకోవాలని అన్నారు. ఇక, పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పట్టించుకోకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాస్తానని సీఎం రేవంత్ అన్నారు.